ప్రసాదం ఆకులతో వినాయక విగ్రహం.. సూపర్ ఉందిగా.. హైదరాబాద్లో ఎక్కడంటే..

ప్రసాదం ఆకులతో వినాయక విగ్రహం.. సూపర్ ఉందిగా.. హైదరాబాద్లో ఎక్కడంటే..

హైదరాబాద్: ఉప్పల్ నియోజకవర్గం నాచారం బాబానగర్‌లో పర్యావరణహిత వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సాధారణంగా ఉపయోగించే వస్తువులతోనే ఏకంగా 15 అడుగుల ఎత్తైన వినాయకుడిని తయారు చేశారు.

నాచారం బాబానగర్‌కు చెందిన భవానిగొండ కుటుంబం గత 17 ఏళ్లుగా పర్యావరణహిత వినాయక విగ్రహాలను తయారు చేస్తోంది. పర్యావరణ పరిరక్షణ, నీటి కాలుష్య నివారణే లక్ష్యంగా వివిధ రకాల పునర్వినియోగ పదార్థాలతో విగ్రహాలను రూపొందిస్తున్నారు.

గతంలో పేపర్ కప్పులు, వార్తాపత్రికలు, టిష్యూ పేపర్లను ఉపయోగించారు. ఈసారి ప్రసాదం కోసం ఉపయోగించే ఆకులు, దొప్పలతో వినూత్నంగా వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. సుమారు 6 వేల ఆకులు, దొప్పలను ఉపయోగించి 15 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని రూపొందించారు.

పూర్తిగా పర్యావరణహిత పదార్థాలతో తయారు చేయడంతో నీటిలో నిమజ్జనం చేసినా కాలుష్యం కలగదని నిర్వాహకులు చెబుతున్నారు. పర్యావరణాన్ని కాపాడుతూ భక్తి, సంప్రదాయాలను కొనసాగించాలనే సందేశాన్ని ఈ వినాయక విగ్రహం అందిస్తోంది.