జూరాల ప్రాజెక్ట్‌ దగ్గర ఉద్రిక్తత.. ఎడమ కాలువ గేట్లు ఎత్తి నీళ్లు వదులుకున్న రైతులు !

జూరాల ప్రాజెక్ట్‌ దగ్గర ఉద్రిక్తత.. ఎడమ కాలువ గేట్లు ఎత్తి నీళ్లు వదులుకున్న రైతులు !

వనపర్తి: వనపర్తి జిల్లా అమరచింత మండలం జూరాల ప్రాజెక్టు నుంచి పంట పొలాలకు నీటి విడుదల కోసం రైతుల ఆందోళన చేశారు. ధర్నా చేసినా అధికారులు స్పందించకపోవడంతో రైతులే ఎడమ కాలువ నీటిని వదులుకున్నారు. ఆయకట్టుకు నీటి విడుదల కోసం ఉదయం నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారు.

ఎగువ నుంచి వరద లేదని, తాగునీటి కోసమే నీరుందని అధికారులు వివరించినప్పటికీ రైతులు నీటిని వదులుకోవడం గమనార్హం. రాష్ట్రంపై ఎల్ నినో ఎఫెక్ట్ తీవ్రంగా ఉందని.. దీని ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు.

‘వర్షాలు లేకపోవడం వల్ల సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైతుల బాధలు మేము అర్థం చేసుకోగలం.. కానీ తాగునీటికే మా తొలి ప్రాధాన్యం’ అని మంత్రి ప్రకటించారు. గోదావరి, కృష్ణా బేసిన్లలోని రిజర్వాయర్లలో నీటి మట్టాలు వేగంగా పడిపోతున్నాయని, వచ్చే వేసవికాలం వరకు నీళ్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వరద ప్రవాహాలను బట్టి సాగునీటి సరఫరాపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

ఎల్ నినో కారణంగా ఈసారి కరువు తప్పదని శాస్త్రవేత్తలు ముందుగానే తెలిపారని, అందువల్లే వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు చెప్పామని గుర్తుచేశారు. ప్రస్తుతం గోదావరి, కృష్ణా బేసిన్లలోని అన్ని రిజర్వాయర్లలో కలిపి 585 టీఎంసీలకు కేవలం 241 టీఎంసీల నీళ్లే ఉన్నాయని అసెంబ్లీలో వెల్లడించారు.

‘గతేడాది ఇదే సమయానికి శ్రీశైలంలో 153.56 టీఎంసీలు ఉండగా ఇప్పుడు ఈ ప్రాజెక్టులో కేవలం 61 టీఎంసీలే ఉన్నాయి. నాగార్జున సాగర్‎లో గతేడాది 174 టీఎంసీలు ఉంటే.. ఇప్పుడు 44 టీఎంసీలే ఉన్నాయి.’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించిన సంగతి తెలిసిందే.