ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‎కు సర్ నోటీసులు.. బీజేపీపై ఆప్ ఫైర్

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‎కు సర్ నోటీసులు.. బీజేపీపై ఆప్ ఫైర్

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ (ఆప్), ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‎కు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో ఢిల్లీ ఎన్నికల సంఘం అధికారులు నోటీసులు జారీ చేశారు. కేజ్రీవాల్‎తో పాటు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్, కుమారుడు పుల్కిత్ కేజ్రీవాల్, ఆయన తల్లిదండ్రులు గోవింద్ రామ్ కేజ్రీవాల్, గీతా దేవిలకు కూడా అధికారులు నోటీసులు ఇచ్చారు. గత ఓటర్ జాబితా రికార్డులతో వీరి ప్రస్తుత వివరాలు సరిపోలకపోవడంతో అన్-మ్యాపింగ్ కేటగిరీ కింద ధృవీకరణ కోసం ఈ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. కేజ్రీవాల్ కుటుంబానికి న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు హక్కు ఉంది. 

బీజేపీపై ఆప్ ఫైర్

సర్ ప్రక్రియలో భాగంగా కేజ్రీవాల్ ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు ఇవ్వడంతో ఎన్నికల సంఘం, బీజేపీపై ఆప్ ఫైర్ అయ్యింది. మూడు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి వివరాలు ఎలా తారుమారు అవుతాయని ప్రశ్నించింది. రాజకీయ కుట్రలో భాగంగానే కేజ్రీవాల్, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కు సర్ నోటీసులు ఇచ్చారని ఆరోపించింది. కేంద్రంలోని మోడీ సర్కార్ ఎన్నికల సంఘాన్ని గుప్పిట్లో పెట్టుకుని ప్రతిపక్ష నేతలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్ పేరుతో ఢిల్లీలో భారీగా ఓట్లు తొలగించారని.. ఇది ప్రజాస్వామ్యాన్ని అణచివేయడమేనని విమర్శించింది. 

ఈసీ క్లారిటీ

సర్ ప్రక్రియలో భాగంగా కేజ్రీవాల్, ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు ఇవ్వడంపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ అంశంపై అధికార బీజేపీ, ప్రతిపక్ష ఆప్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‎కు సర్ నోటీసులు జారీ చేయడంపై ఢిల్లీ ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. సర్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని తెలిపింది. అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా నష్టపోకుండా ఉండేందుకే కసరత్తు చేస్తున్నట్లు పేర్కొంది. నోటీసులు అందుకున్న ఆధారాలు సమర్పించి తిరిగి ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపింది.