ఢిల్లీ యూనివర్శిటీ ఎన్నికల్లో సంచలనం: ఉపాధ్యక్షుడిగా బస్సు కండక్టర్ కొడుకు చారిత్రాత్మక విజయం

ఢిల్లీ యూనివర్శిటీ ఎన్నికల్లో సంచలనం: ఉపాధ్యక్షుడిగా బస్సు కండక్టర్ కొడుకు చారిత్రాత్మక విజయం

న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్ యూనియన్ (డీయూఎస్‎యూ) ఎన్నికల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఉపాధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో ఇండిపెండెంట్ అభ్యర్థి దీపాంశు షోకీన్ చారిత్రాత్మక విజయం సాధించాడు. ఏబీవీపీ, ఎన్ఎస్‎యూఐ అభ్యర్థులను భారీ మెజార్టీతో ఓడించి ఉపాధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నాడు. తద్వారా డీయూఎస్‎యూ ఎన్నికల చరిత్రలో ఉపాధ్యక్ష పదవిని దక్కించుకున్న తొలి స్వతంత్ర అభ్యర్థిగా దీపాంశు షోకీన్ చరిత్ర సృష్టించాడు. 

ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ నాలుగు పోస్టులకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీ, కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్ఎస్‎యూఐ హోరాహోరీగా తలపడ్డాయి. అధ్యక్ష, సెక్రటరీ, జాయింట్ మూడు పోస్టులను ఏబీవీపీ దక్కించుకుంది. ఉపాధ్యక్ష పీఠాన్ని స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకీన్ కైవసం చేసుకున్నాడు. 

ఎవరీ దీపాంశు షోకీన్..?

ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్ యూనిఎన్ ఎన్నికల్లో ఉపాధ్యక్ష స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి చారిత్రాత్మక విజయం సాధించిన దీపాంశు షోకీన్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు. డీయూఎస్‎యూ ఎన్నికల చరిత్రలోనే ఉపాధ్యక్షుడిగా విజయం సాధించిన తొలి స్వతంత్ర అభ్యర్థిగా రికార్డ్ సృష్టించాడు. దీంతో ఎవరీ దీపాంశు షోకీన్ అనే నెటిజన్లు ఆరా తీస్తున్నారు. 

దీపాంశు షోకీన్ పశ్చిమ ఢిల్లీ జిల్లా పీరగఢీ ప్రాంతానికి చెందినవాడు. అతని తండ్రి బస్ కండక్టర్‌గా పనిచేస్తుండగా.. తల్లి అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తుంది. భగత్ సింగ్ కళాశాల నుంచి షోకీన్ గ్రాడ్యుయేట్ అయ్యాడు. యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధం కావాలని అతని కోరుకున్నప్పటికీ షోకీన్ మాత్రం విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఇటీవల ఢిల్లీలోని సత్య నికేతన్‌లో పీజీ వసతి గృహం కూలిపోయిన ఘటన తర్వాత బాధితులకు న్యాయం జరిగే వరకు చెప్పులు ధరించబోనని షోకీన్ శపథం చేసి వార్తల్లో నిలిచాడు. 

ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి షోకీన్ మొదట ఎన్‎ఎస్‎యూఐ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. అయితే, నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఎన్‎ఎస్‎యూఐ కోరడంతో అందుకు షోకీన్ నిరాకరించి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాడు. చివరకు ఏబీవీపీ, ఎన్‎ఎస్‎యూఐ అభ్యర్థులను ఓడించి ఉపాధ్య ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించాడు.  

డీయూఎస్‎యూ ఎన్నికల్లో గెలిచింది వీరే..

ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఏబీవీపీ అభ్యర్థి యశ్ దబాస్ విజయం సాధించాడు. ఎన్‌ఎస్‌యూఐకి చెందిన ప్రత్యర్థి విజయ్ మీనాపై యశ్ దబాస్ గెలుపొందాడు.  స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన దీపాంశు షోకీన్ అనూహ్యంగా ఉపాధ్యక్ష పదవిని దక్కించుకున్నాడు. ఏబీవీపీ, ఎన్ఎస్‎యూఐ అభ్యర్థులను షోకీన్ ఓడించాడు. సెక్రటరీ ఎన్నికలో ఏబీవీపీ అభ్యర్థిని రియా ఛావ్డి విజయం సాధించింది. ఏబీవీపీ అభ్యర్థి లక్ష్య రాజ్ సింగ్ జాయింట్ సెక్రటరీ పదవిని కైవసం చేసుకున్నాడు.