సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట మీదుగా వెళ్లాల్సిన బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్‌ను మార్చడాన్ని నిరసిస్తూ బుల్లెట్ ట్రైన్ సాధన పోరాట కమిటీ, అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన సూర్యాపేట బంద్ శుక్రవారం ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది. ఆర్టీసీ డిపో ఎదురుగా నిరసనకారులు బైఠాయించి బస్సులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఆందోళనలో భాగంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోగా, పోలీసులు జోక్యం చేసుకుని ప్రొఫెసర్ ఆరుట్ల జానకిరెడ్డితో సహా పలువురు ఉద్యమకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ బంద్‌కు పట్టణంలోని వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు, ఆటోనగర్ కార్మికులు, వివిధ ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా సహకరించి తమ పూర్తి సంఘీభావం ప్రకటించాయి.
పాత అలైన్ మెంట్ కొనసాగించాలి : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
గతంలో ప్రతిపాదించిన పాత అలైన్‌మెంట్ ప్రకారం చౌటుప్పల్, సూర్యాపేట, కోదాడ మీదుగా బుల్లెట్ ట్రైన్ వెళ్తేనే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజలకు భారీ ప్రయోజనం కలుగుతుందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్‌హెచ్ 65 జాతీయ రహదారికి సమాంతరంగా బుల్లెట్ ట్రైన్ వేయడమే సహేతుకమైన నిర్ణయమన్నారు.
ప్రస్తుత అలైన్‌మెంట్ వల్ల తెలంగాణ ప్రజలకు నయాపైసా ఉపయోగం లేదని, అసలు భవిష్యత్తే లేని ఫ్యూచర్ సిటీ మీదుగా ఈ మార్గాన్ని ఎవరి ప్రయోజనాల కోసం ప్రతిపాదించారని ప్రశ్నించారు. జనం లేని ప్రాంతం గుండా రైల్వే లైన్ తీసుకెళ్లడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి కొనుగోలు చేసిన మూడు వేల ఎకరాల భూముల కోసమే ఈ రూట్ మార్చారని, దీనివల్ల ఆయనతో పాటు ఆంధ్ర ప్రాంతానికే మేలు జరుగుతుందని ఆరోపించారు.
