తాత్కాలిక చర్యలతో ‘లీక్‌‌’లను ఆపలేం..నీట్ నిర్వహణపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

తాత్కాలిక చర్యలతో   ‘లీక్‌‌’లను ఆపలేం..నీట్ నిర్వహణపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
  • ఎన్‌టీఏ ఆఫీసును సందర్శించి పనితీరును పరిశీలిస్తామని వెల్లడి

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీలను అరికట్టడానికి కేవలం తాత్కాలిక చర్యలు సరిపోవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షా విధానాన్ని పూర్తిగా శాశ్వత ప్రాతిపదికన సంస్థీకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్​టీఏ) వ్యవస్థను, దాని పనితీరును స్వయంగా పరిశీలించేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని ధర్మాసనం కొత్తగా అప్‌‌గ్రేడ్ చేసిన కేంద్రాన్ని సందర్శించనున్నట్టు ప్రకటించింది. 

వ్యవస్థ నిజంగా పనిచేస్తోందా? లేదా? అక్కడ తగినంత సిబ్బంది, ఏర్పాట్లు ఉన్నాయా? లేదా? అని స్వయంగా అంచనా వేస్తామని పేర్కొంది. ఎన్‌‌టీఏలో కేవలం డిప్యూటేషన్‌‌పై అధికారులను నియమించడం కాకుండా.. శాశ్వత సిబ్బంది, శాశ్వత విభాగాలు ఉండేలా పటిష్టమైన నిర్మాణం ఏర్పాటు చేయాలని ధర్మాసనం అభిప్రాయపడింది. 

అప్పుడే లీకేజీలకు శాశ్వత అడ్డుకట్ట పడుతుందని తెలిపింది. నీట్ పరీక్ష విధానంలో సమూల సంస్కరణలు సూచించేందుకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఏర్పాటైన అత్యున్నత స్థాయి ప్యానెల్ సమగ్ర సంప్రదింపులు జరిపిందని, ఈ నెల చివరి నాటికి తన మొదటి మధ్యంతర నివేదికను సమర్పించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. 

నీట్-యూజీ పేపర్ లీక్ ఉదంతం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన నేపథ్యంలో, ఎన్‌‌టీఏ పరీక్షా విధానంలో కేంద్రం అనేక మార్పులు చేపట్టింది. నాలుగు అంచెల పేపర్ పరిశీలన విధానాన్ని అమలు చేయడం, సుమారు 600 మంది నిపుణులను తొలగించడం, కొత్త సబ్జెక్ట్ నిపుణులను రంగంలోకి దించడం వంటి సమగ్ర ప్రక్షాళన చర్యలను చేపట్టినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ అంశంపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని సిబ్బంది, శిక్షణ శాఖ జాయింట్​సెక్రటరీని సుప్రీంకోర్టు ఆదేశించింది.

కేసుల విచారణకు ఫిక్స్​డ్ టైమ్‌‌లైన్ విధించలేం..

హైకోర్టులు లేదా దిగువ కోర్టులు పెండింగ్‌‌లో ఉన్న కేసులను నిర్ణీత గడువులోగా (ఫిక్స్​డ్ టైమ్‌‌లైన్) పూర్తి చేయాలని కఠినమైన గడువులు విధించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పీలేట్ కోర్టులు హైకోర్టులు, సబార్డినేట్ కోర్టులు ఎదుర్కొంటున్న విపరీతమైన పనిభారాన్ని దృష్టిలో ఉంచుకోవాలని అభిప్రాయపడింది. 

ఒక వ్యక్తి తన పాస్‌‌పోర్ట్‌‌ను తిరిగి ఇప్పించాలని, తనపై ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్‌‌ను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌‌ను త్వరగా విచారించేలా ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ కేసును 2027 ఫిబ్రవరికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి నాలుగు వారాల్లోగా తీర్పు చెప్పేలా హైకోర్టును ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా, సుప్రీంకోర్టు ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది.