- కులగణనలో ఉపకులాలనూ లెక్కించాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: బీసీ కులాల జనాభాను తక్కువగా చూపించి వారు ఐక్యంగా పోరాడకుండా కేంద్ర ప్రభుత్వం రాజకీయ కుట్ర చేస్తోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జనగణనలో ఓబీసీ కాలాన్ని కులాల వారీగా చూపకుండా కుట్రలు చేస్తుందన్నారు. శుక్రవారం ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్, సకల జన సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘పాలిటిక్స్ బియాండ్ క్యాస్ట్’’ సదస్సులో ఆమె మాట్లాడారు.
కేంద్రం చేపట్టే కుల గణనలో బీసీ జనాభా విషయంలో ఎలాంటి గందరగోళం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కేవలం క్యాస్ట్ కాలం పెట్టేసి చేతులు దులుపుకుంటామంటే ఊరుకునేది లేదన్నారు. ప్రతి రాష్ట్రంలో ఉన్న కులాల జాబితాను కచ్చితంగా అప్ లోడ్ చేయాలని, ఉపకులాలను కూడా కలిపి లెక్కించాలన్నారు. లేదంటే బీసీల జనాభా తక్కువగా కనిపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఒకే కులానికి సంబంధించి దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్టేటస్ ఉందని, ఆ సమస్యను పరిష్కరించాలంటే బీసీ కులాల ఉపకులాలను కూడా కలిపి లెక్కించాల్సిందేనని స్పష్టం చేశారు.
ఇప్పటికే ఎస్సీ, ఎస్టీల్లో ఉన్న 57 ఉపకులాల కారణంగా ఉప కులాల్లో వారికి న్యాయం జరగటం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కుల గణన పేరుతో బీసీ జనాభాను తక్కువ చేసి చూపిందన్నారు. కేంద్రం చేపట్టే కుల గణన ద్వారా ఆ సమస్య తీరుతుందని భావిస్తే.. వాళ్లు సమస్యను మరింత జఠిలం చేస్తున్నారని మండిపడ్డారు. కుల వివక్ష అనేది మన డీఎన్ఏలోనే పాతుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి, స్పీకర్ లాంటి వాళ్లు కూడా కుల వివక్షకు గురికావడం అన్యాయమన్నారు.
