- బీఆర్ఎస్ హయాంలో లెక్కకు మించి భూ కబ్జాలు : ఆకునూరి మురళి
కరీంనగర్, వెలుగు : విద్యను విస్మరిస్తూ ఎన్నికల ప్రచారానికి మాత్రమే ఉపయోగపడే ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం రాజకీయ పార్టీల వ్యూహంగా మారిందని తెలంగాణ విద్యాకమిషన్ మాజీ చైర్మన్, తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ సభ్యుడు ఆకునూరి మురళి విమర్శించారు. విద్యతో ఇంకెన్నాళ్లు రాజకీయాలు చేస్తారని ప్రశ్నించారు. టీపీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యా బస్ యాత్రలో భాగంగా కరీంనగర్ ఫిలిం భవన్ లో మేధావులు, ప్రజాసంఘాల నాయకులతో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రూ.6 వేల కోట్లు ఇస్తే రాష్ట్రంలోని రెండు వేల ప్రభుత్వ స్కూళ్లు బాగుపడుతాయన్నారు.
రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో స్కూళ్లకు ఇవ్వడానికి రూ.6 వేల కోట్లు లేవా అని ప్రశ్నించారు. యూనివర్సిటీల్లో ఖాళీలు ఎందుకు నింపడం లేదని నిలదీశారు. ప్రైమరీ స్కూల్స్ లో ఒకే టీచర్ అనేక తరగతులకు బోధిస్తుండడంతో నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. దీంతో ప్రజలు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నారన్నారు. దేశంలో 11.5 లక్షల స్కూళ్లు ఉంటే.. పీఎం శ్రీ స్కీం కింద 6,500 స్కూళ్లను మాత్రమే అభివృద్ధి చేస్తున్నారని, ఈ లెక్కన మొత్తం స్కూళ్లు అభివృద్ధి చేయాలంటే 350 ఏండ్లు పడుతుందన్నారు. ప్రస్తుతం బయటకు వచ్చిన లెక్కలకు మించిన భూ కబ్జాలు బీఆర్ఎస్ హయాంలో జరిగాయని ఆరోపించారు. ముప్పూరి కుమారన్న అధ్యక్షత జరిగిన సమావేశంలో మాజీ ఐఏఎస్ ఎం.చంపాలాల్, టీపీఎఫ్ సభ్యులు ప్రొఫెసర్ పద్మజాషా, డాక్టర్ పాలకుర్తి జగదీశ్వర్, ఎన్. రుబీనా, సృజన యాదవ్, నిఖిల్ విజయ కృష్ణ, ధర్మేంద్ర నదిమెంట్ల పాల్గొన్నారు.
