- ఆ డెడ్బాడీవే కావచ్చని, తల, చేతులు కుక్కలు ఎత్తుకెళ్లి తిని ఉంటాయని పోలీసుల అనుమానం
- మగ వ్యక్తి శవంగా గుర్తింపు
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలోని ఎబ్బనూర్ చెరువు సమీపంలోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మొండెం కుళ్లిపోతున్న స్థితిలో కనిపించింది. నడుం నుంచి కింది భాగం మాత్రమే ఉండడం..తల, కాళ్లు , చేతులు, కడుపు వంటి భాగాలు కనిపించకపోవడంతో పోలీసులు చుట్టుపక్కల గాలించగా పుర్రెతో పాటు ఒక చేయి ఎముక కనిపించాయి.
దీంతో ఇది ఆత్మహత్యా..లేక హత్య చేసి ఇక్కడ పడేశారా అన్న కోణంలో అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 15 రోజుల కింద చనిపోయి ఉంటాడని అనుకుంటున్నారు. సమీప పోలీస్స్టేషన్లలో నమోదైన మిస్సింగ్కేసుల వివరాలు తెలుసుకుంటున్నారు.
శుక్రవారం ఉదయం ఎబ్బనూర్కు చెందిన మేకల కాపరి ఉరడి యాదయ్య మేకలను తీసుకుని శివారులోని అడవిలోకి వెళ్లగా దుర్వాసన వచ్చింది. అటువైపు వెళ్లి చూడగా, కాల్వ ఒడ్డున ఉన్న చెట్ల పొదల్లో మగ వ్యక్తికి చెందిన మొండెం కనిపించింది. గ్రామస్తులకు చెప్పగా వారు ధారూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వికారాబాద్డీఎస్పీ అంజయ్య, ధారూర్ సీఐ రఘురాం, ఎస్ఐ రాజేందర్ సంఘటనా స్థలానికి చేరుకుని చుట్టుపక్కల గాలించారు. కొద్ది దూరంలో పుర్రెతో పాటు చేయి ఎముక కనిపించాయి.
అయితే, తమకు దొరికిన తల, చేయి ఎముక ఆ మొండానికి సంబంధించినదిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బహుశా కుక్కలు ఎత్తుకెళ్లి తినడం వల్ల తల పుర్రెగా...చేయి భాగం ఎముకగా మారి ఉంటుందని భావిస్తున్నారు. మొండెంపై ప్యాంట్ఉండడం వల్ల కుక్కలు తీసుకెళ్లలేకపోయి ఉంటాయని అనుకుంటున్నారు. కానీ, ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమంటున్నారు. కేసు దర్యాప్తులో అన్ని విషయాలు బయటపడతాయని ఎస్ఐ రాజేందర్ తెలిపారు.
