బీజేపీ హఠావో.. బీసీ రిజర్వేషన్‌‌ బచావో.. ఓబీసీ కులగణన కోసం దేశవ్యాప్త ఉద్యమం: జాజుల

బీజేపీ హఠావో.. బీసీ రిజర్వేషన్‌‌ బచావో.. ఓబీసీ కులగణన కోసం దేశవ్యాప్త ఉద్యమం: జాజుల

సైఫాబాద్, వెలుగు: ‘బీజేపీ హఠావో.. బీసీ రిజర్వేషన్‌‌ బచావో’ నినాదంతో దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్‌‌ జాజుల శ్రీనివాస్‌‌గౌడ్‌‌ తెలిపారు. బీసీలంతా కాక్రోజ్‌‌ పార్టీ తరహాలో ఐక్యంగా ఉద్యమిస్తే కేంద్ర ప్రభుత్వం దిగివస్తుందని చెప్పారు.   

సెప్టెంబర్ 20న హైదరాబాద్‌‌లో నిర్వహించనున్న జాతీయ ఓబీసీ సదస్సు పోస్టర్‌‌ను హైదరాబాద్  సైఫాబాద్‌‌లోని జేఏసీ ఆఫీస్​లో రిలీజ్​ చేసి మాట్లాడారు. జనగణనలో ఓబీసీ కులాల లెక్కలు తీస్తామని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని విస్మరించిందని విమర్శించారు. జాతీయ సదస్సు ద్వారా జనగణనలో ఓబీసీ కులాల వివరాలను చేర్చాలనే డిమాండ్‌‌తో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.

ప్రధాని మోదీ ఓబీసీ వర్గానికి చెందినప్పటికీ, ఆ వర్గానికి చేసిందేమీ లేదన్నారు. బీజేపీ విధానాల్లోనే బీసీ వ్యతిరేకత ఉందని, బీసీలకు రాజ్యాధికారం దక్కకుండా కుట్ర జరుగుతోందన్నారు. సదస్సుకు 29 రాష్ట్రాల నుంచి బీసీ ప్రతినిధులు హాజరు కానున్నారని, ఓబీసీల ఉద్యమానికి ఇది మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ నేతలకు బీసీలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే జనగణన పక్రియను నిలిపివేయాలని డిమాండ్  చేశారు.

లేదంటే దేశవ్యాప్తంగా బీసీల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.  బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, జేఏసీ వర్కింగ్  చైర్మన్  గుజ్జ కృష్ణ, నేతలు తాటికొండ విక్రమ్  గౌడ్, బి మణిమంజరి, కాటేపల్లి వీరస్వామి పాల్గొన్నారు.