హైదరాబాద్, వెలుగు: ఏజెన్సీ ప్రాంతాల్లో చేపట్టనున్న సివిల్ కానిస్టేబుల్ నియామకాల్లో ఎస్టీలకు 75 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎస్టీ ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, వెడ్మ బొజ్జు, ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు కోరారు.
శుక్రవారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. 2022 పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో అమలు చేసిన 75 శాతం రిజర్వేషన్‌ను 2026 నియామకాల్లోనూ కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
1988లో జారీ చేసిన జీవో 109, 2018 గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం గిరిజన ప్రాంతాల్లో ఎస్టీలకు 75 శాతం రిజర్వేషన్‌కు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు ఉన్నాయన్నారు. సంబంధిత అధికారులతో సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్లు అడ్లూరి తెలిపారు.
