ఐటీ దిగ్గజం జెన్‌పాక్ట్‌కు భారీ షాక్: గురుగ్రామ్ హెడ్ ఆఫీస్ జప్తును సమర్థించిన కర్ణాటక హైకోర్టు!

ఐటీ దిగ్గజం జెన్‌పాక్ట్‌కు భారీ షాక్: గురుగ్రామ్ హెడ్ ఆఫీస్ జప్తును సమర్థించిన కర్ణాటక హైకోర్టు!

కర్ణాటక హైకోర్టు ఐటీ దిగ్గజం జెన్‌పాక్ట్ ఇండియా సంస్థకు సంబంధించిన కేసులో ఇచ్చిన తీర్పు వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రూ.7వేల 800 కోట్ల భారీ 'రౌండ్ ట్రిప్పింగ్' ఆరోపణల నేపథ్యంలో ED తీసుకున్న చర్యలకు హైకోర్టు సమర్థించింది. గురుగ్రామ్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని ఈడీ జప్తు చేయడాన్ని సరైన చర్యగా పేర్కొంటూ.. కంపెనీకి సంబంధించిన మరో కీలక అంశంలో మాత్రం ఊరటనిచ్చింది. 

ఈడీ ఆరోపణలు ఏమిటి?
మొరాన్ స్టాన్లీ నుంచి తీసుకున్న లోన్స్.. బెర్ముడా, లక్సెంబర్గ్, సింగపూర్‌లోని వివిధ జెన్‌పాక్ట్ అనుబంధ సంస్థల మధ్య జరిగిన లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. బెర్ముడాలోని జెన్‌పాక్ట్ సంస్థకు మోరాన్ స్టాన్లీ సమకూర్చిన 737.5 మిలియన్ డాలర్ల రుణాన్ని లక్సెంబర్గ్ యూనిట్‌కు మళ్లించారు. అక్కడి నుంచి ఎంపవర్ ఇండియా జారీ చేసిన నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లలో పెట్టుబడి పెట్టారు.

ఆ తర్వాత నిధులను హెడ్‌స్ట్రాంగ్ సింగపూర్ ద్వారా జెన్‌పాక్ట్ ఇండియాలో 51 శాతం వాటా కొనుగోలుకు ఉపయోగించి, చివరకు ఆ మొత్తాన్ని మళ్లీ బెర్ముడా సంస్థకు పంపి అసలు అప్పును తీర్చేశారని ఈడీ గుర్తించింది. ఇవన్నీ విడివిడిగా జరిగిన వాణిజ్య లావాదేవీలు కావని.. ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న నిధుల మళ్లింపు(రౌండ్ ట్రిప్పింగ్) అని ఈడీ వాదించింది. 2018 నుంచి 2023 మధ్య కాలంలో భారతీయ వ్యాపార నిల్వల నుంచి దాదాపు రూ.7వేల 800 కోట్లను లక్సెంబర్గ్ సంస్థకు తిరిగి చెల్లించినట్లు ఈడీ గుర్తించింది. 

జెన్‌పాక్ట్ వాదనలు..
ఈ ఆరోపణలను జెన్‌పాక్ట్ తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగా జరిగినవే తప్ప రౌండ్ ట్రిప్పింగ్ కాదని వాదించింది. అయితే ఫెమా చట్టంలోని సెక్షన్ 37A కింద ఈడీ ఆస్తులను జప్తు చేయడానికి తగిన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని హైకోర్టు స్పష్టం చేసింది. గురుగ్రామ్ హెడ్ ఆఫీస్ జప్తును సమర్థిస్తూనే.. కంపెనీ అక్కడ తన సాధారణ వ్యాపార కార్యకలాపాలను నిర్వర్తించుకోవచ్చని స్పష్టం చేసింది. కాకపోతే ఆ ఆస్తిపై థర్డ్ పార్టీ వ్యక్తులు లేదా సంస్థలకు హక్కులను కల్పించడం గానీ.. అమ్మటం గానీ చేయకూడదని ఆదేశించింది. ఇది అంతిమంగా నేర నిర్ధారణ కాదని, సంబంధిత అథారిటీ ముందు కంపెనీ తన వాదనలు వినిపించవచ్చని కోర్టు పేర్కొంది.

GIFT సిటీ పెట్టుబడులపై ఊరట..
ఈ కేసులో జెన్‌పాక్ట్‌కు హైకోర్టు ఒక పెద్ద ఊరటనిచ్చింది. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో పెట్టుబడి పెట్టేందుకు తాము దరఖాస్తు చేసుకున్న 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' నిరాకరిస్తూ ఈడీ జారీ చేసిన కమ్యూనికేషన్‌ను కోర్టు రద్దు చేసింది. ఈ దరఖాస్తును పునఃపరిశీలించి, 10 రోజుల్లోగా తగిన కారణాలతో కూడిన కొత్త ఉత్తర్వులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది కర్ణాటక హైకోర్టు. ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ఇది మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది.