రష్యా శాంక్షన్స్ బిల్లుతో ఇండియాలో ఏఏ రంగాలపై ప్రభావం ఉంటుంది?

రష్యా శాంక్షన్స్ బిల్లుతో ఇండియాలో ఏఏ రంగాలపై ప్రభావం ఉంటుంది?

అమెరికా కాంగ్రెస్ ఉభయసభల ఆమోదం పొందిన రష్యా ఆయిల్ అండ్ గ్యాస్ శాంక్షన్స్ బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా సంతకం చేశారు. ఈ కొత్త చట్టం సంతకం చేసిన తేదీ నుంచి సరిగ్గా 30 రోజుల్లోపు  అమలులోకి వస్తుంది. ప్రధానంగా చైనా, భారత్ ను టార్గెట్ చేసి ట్రంప్ ఈ బిల్లును తెచ్చారు. దీని కింద రష్యా నుంచి క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలపై 100% వరకూ టారిఫ్ విధించే అధికారాన్ని ఈ చట్టం అమెరికా అధ్యక్షుడికి కల్పిస్తుంది. 

ఏయే దేశాలపై ఎంత శాతం టారిఫ్ విధించాలనే పూర్తి విచక్షణాధికారం ట్రంప్ యంత్రాంగం చేతిలోనే ఉంది. అలాగే జాతీయ ప్రయోజనాల రీత్యా అవసరమైతే ఈ సుంకాల నుంచి కొన్ని దేశాలకు మినహాయింపులు కూడా ఇచ్చే వెసులుబాటు చట్టంలో ఉంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్ రష్యా నుంచి డిస్కౌంట్ రేట్లకు భారీగా క్రూడ్ కొనుగోలు చేస్తోంది. ఒకవేళ అమెరికా ఒత్తిడితో రష్యా ఆయిల్ దిగుమతులు తగ్గించుకోవాల్సి వస్తే.. భారత్ ప్రత్యామ్నాయంగా పశ్చిమాసియా, ఆఫ్రికా తదితర దేశాల వైపు చూడాల్సి వస్తుంది. దీనివల్ల రవాణా ఖర్చులు, గ్లోబల్ ఆయిల్ ధరలను బట్టి భారతదేశ ఇంధన దిగుమతి బిల్లు విపరీతంగా పెరిగి ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుంది.

ఏ ఏ ఉత్పత్తులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది?
అమెరికా గనుక భారత్‌పై టారిఫ్ అస్త్రాన్ని ప్రయోగిస్తే.. అమెరికా మార్కెట్‌లోకి ఎగుమతయ్యే భారతీయ ఉత్పత్తులు తీవ్ర పోటీతత్వాన్ని కోల్పోయి నష్టపోయే ప్రమాదముంది. 

* ఇంజనీరింగ్ వస్తువులు
* ఫార్మాస్యూటికల్స్ & మందులు
* టెక్స్‌టైల్ అండ్ గార్మెంట్స్
* కెమికల్స్
* ఎలక్ట్రానిక్స్
* జెమ్స్ అండ్ జ్యువెలర్స్
* పెట్రోలియం ఉత్పత్తులు
* తయారీ రంగం ఉత్పత్తులు
* ఆటోమెుబైల్ స్పేర్స్

ఇండియా ప్లాన్ ఏంటి?
అమెరికా తీసుకొచ్చిన కొత్త చట్టంపై న్యూఢిల్లీ స్పందిస్తూ.. దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఎనర్జీ సేఫ్టీని కాపాడటమే తమ ఫస్ట్ ప్రయారిటీ అని స్పష్టం చేసింది. భారత్ తన ఆర్థిక, వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని.. వాణిజ్య వర్గాలతో కలిసి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. అమెరికా చర్యలను ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో మోడీ సర్కార్ సంసిద్ధం అవుతోంది.