- అదనపు డబ్బుల కోసం కొడతానని బెదిరింపు
జూబ్లీహిల్స్, వెలుగు: ఓ రాపిడో ఆటోడ్రైవర్ ప్రయాణం ముగిశాక బాలిక వద్ద అదనపు డబ్బులు డిమాండ్ చేయడమే కాకుండా ఆమెతో దురుసుగా ప్రవర్తించి, బెదిరించాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హైదర్‌నగర్‌కు చెందిన శరత్ చందర్ రావు తన కుమార్తెను శుక్రవారం ఫిల్మ్‌నగర్‌లోని వర్ణ ఆర్ట్స్ అకాడమీకి పంపేందుకు రాపిడో ఆటో బుక్ చేశారు.
అయితే, డ్రైవర్ తప్పు దారిలో జూబ్లీహిల్స్ తీసుకెళ్లి, గమ్యస్థానానికి చేరాక అదనంగా డబ్బులు ఇవ్వాలని గొడవకు దిగాడు. బాలిక నిరాకరించడంతో ఆమె మొబైల్ లాక్కొని, కొడతానని బెదిరించాడు. బాధితురాలు తన తండ్రికి ఫోన్‌చేసి విషయం చెప్పగా.. ఆయన ఆందోళన చెంది గూగుల్‌పే ద్వారా డబ్బులు చెల్లించాడు. అయినా డ్రైవర్ ప్రవర్తన మారలేదు. అకాడమీలో ఉన్న తల్లిదండ్రులు జోక్యం చేసుకోవడంతో అతను వెనక్కి తగ్గాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, సీసీ ఫుటేజీ, జీపీఎస్ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
