- శివసేన, ఎన్సీపీ విషయంలో చేసిందే టీఎంసీ ఇష్యూలో చేస్తున్నరు
- ఈసీ, బీజేపీ కలిసి పార్టీలను చోరీ చేస్తున్నాయి: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి పార్టీలను చీల్చేందుకు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అప్పట్లో శివసేన, ఎన్సీపీ విషయంలో ఏం చేశారో ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఇష్యూలోనూ అదే చేస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో టీఎంసీ పేరును, ఎన్నికల గుర్తును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై రాహుల్ గాంధీ శుక్రవారం స్పందించారు.
ఒక రాజకీయ పార్టీనే ‘చోరీ’ చేయగలిగితే.. కోట్లాది మంది భారతీయుల ఓట్లను చోరీ చేస్తున్నారన్న ప్రతిపక్షాల ఆరోపణల్లో ఆశ్చర్యం లేదన్నారు. ప్రజల తీర్పును కాపాడటం ఈసీ రాజ్యాంగబద్ధ బాధ్యత అని, అయితే ప్రజల తీర్పును మార్చే శక్తులకు సహకరిస్తున్నదని ఆరోపించారు. ‘ఓట్ల చోరీ.. ప్రభుత్వం చోరీ.. ఇప్పుడు పార్టీ చోరీ.. ఇవే మన ప్రజాస్వామ్య పతనానికి చిహ్నాలుగా మారాయి’ అని పేర్కొన్నారు. ఈ పోరాటం కేవలం మమతా బెనర్జీది మాత్రమే కాదని, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలను కోరుకునే ప్రతి పార్టీ, ప్రతి ఓటరు పోరాటమని అన్నారు.
