- పార్టీలోని రెండు వర్గాలకు మమత టీఎంసీ, డెమోక్రటిక్ టీఎంసీగా కొత్త పేర్లు
- దీదీ వర్గానికి ఫుట్‌బాల్ ప్లేయర్ గుర్తు.. రితబ్రత వర్గానికి ఎన్వలప్ సింబల్
- నందిగ్రామ్ బైపోల్ బరి నుంచి తప్పుకున్న మమత వర్గం అభ్యర్థి
- కాంగ్రెస్ అభ్యర్థి మిలన్‌కు దీదీ మద్దతు.. ఆ వెంటనే మిలన్ అరెస్ట్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఇటీవల రెండుగా చీలిపోవడం, తమదే అసలైన పార్టీ అని ఇరువర్గాల మధ్య వివాదం నడుస్తున్న వేళ ఎన్నికల సంఘం (ఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. నందిగ్రామ్, రెజినాగర్ స్థానాలకు అక్టోబర్ 6 న జరగనున్న ఉపఎన్నికల్లో టీఎంసీ పార్టీ పేరును, దాని ఎన్నికల సింబల్ ‘‘జోర్ పూలు(గడ్డి పూలు)’’ని రెండు గ్రూపులూ ఉపయోగించరాదని స్పష్టం చేసింది. రెండు గ్రూపులు మూడు పేర్లు, మూడు ఫ్రీ సింబల్స్ చొప్పున సమర్పించాలని గురువారం రాత్రి ఆదేశించింది.
ఈ క్రమంలో ఆయా వర్గాలు సమర్పించిన విష్‌లిస్ట్ ఆధారంగా ఎన్నికల సంఘం.. రెండు వర్గాలకు కొత్త పేర్లను, గుర్తులను శుక్రవారం కేటాయించింది. మాజీ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని వర్గానికి 'మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్' అనే పేరును, అలాగే 'ఫుట్‌బాల్ ఆటగాడు' సింబల్ ఇచ్చింది. అలాగే, రితబ్రత బెనర్జీ, అరూప్ రాయ్ నేతృత్వంలోని రెబల్స్ గ్రూపునకు 'డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్' అనే పేరును, 'ఎన్వలప్' గుర్తును కేటాయించింది. కేవలం ఉపఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా ఈ మధ్యంతర ఏర్పాట్లు చేశామని.. వివాదంపై తుది నిర్ణయం తీసుకునే వరకు ఇది అమలులో ఉంటుందని ఈసీ పేర్కొంది.
నందిగ్రామ్‌లో తప్పుకున్న మమత వర్గం అభ్యర్థి
రెండు స్థానాల్లో(నందిగ్రామ్, రెజినాగర్) ఉప ఎన్నికకు ఇంకా నెల రోజుల సమయం ఉండగా మాజీ సీఎం మమతా బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నందిగ్రామ్ ఉప ఎన్నిక బరి నుంచి మమత వర్గానికి చెందిన టీఎంసీ అభ్యర్థి సంచితా ప్రధాన్ తప్పుకున్నారు. ఈ మేరకు ఆమె తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. బెంగాల్ సీఎం సువేందు అధికారితో సమావేశమైన అనంతరం పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు సంచిత ప్రకటించారు.
సంచితా ప్రధాన్ నందిగ్రామ్ నుంచి నామినేషన్ ఉపసంహరించుకోవడంపై కూడా మమతా బెనర్జీ స్పందించారు. ఇది ప్రతిపక్షాలను అంతం చేయాలనే ఆలోచనతో బీజేపీ చేస్తున్న కుట్ర అని విమర్శించారు. గతంలో మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే పార్టీని కూడా బీజేపీ చీల్చిందని, ఇప్పుడు టీఎంసీని లేకుండా చేయాలనే ఇలాంటి కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. ఉపఎన్నికలో తన వర్గం నుంచి ఎవరూ పోటీ చేయకుండా బీజేపీ అడ్డుకుంటోందని..ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజన్నారు. ఇక టీఎంసీ తరఫున నందిగ్రామ్ లో మరెవరినీ బరిలోకి దించబోమని.. తమ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతిస్తుందని మమత ప్రకటించారు.
దేశం నుంచి బీజేపీని వెళ్లగొట్టడమే తన లక్ష్యమని.. అందుకోసం జాతీయ స్థాయిలో ఇండియా కూటమితో కలిసి పని చేస్తానని వెల్లడించారు. అయితే, మమత నిర్ణయంపై కాంగ్రెస్ అనేత అధిర్ రంజన్ స్పందిస్తూ.. ఏ ప్రకటననైనా చేసే స్వేచ్ఛ మమతకు ఉందని, కానీ కాంగ్రెస్ పార్టీ ఆమెను ఎలాంటి మద్దతు కోరలేదని తేల్చిచెప్పారు. టీఎంసీ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్న తర్వాతే ఆమె కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారని స్పష్టం చేశారు.
నందిగ్రామ్ కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్
నందిగ్రామ్‌లో కాంగ్రెస్ కు మద్దతిస్తామని మమతా బెనర్జీ ప్రకటించిన కొన్ని గంటలకే కీలక పరిణామం చోటుచేసుకంది. నందిగ్రామ్ ఉపఎన్నికలో బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌ను పోలీసులు మర్డర్ కేసులో అరెస్ట్ చేశారు. 2007 నందిగ్రామ్ భూసేకరణ వ్యతిరేక నిరసనల సమయంలో జరిగిన ఓ హత్య కేసుకు సంబంధించి మిలన్ ప్రధాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇది రాజకీయ కక్ష సాధింపే: మమత
టీఎంసీ పార్టీ పేరు, ఎన్నికల గుర్తును ఈసీ స్తంభింపజేయడంపై వెస్ట్ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఒక చీకటి రోజు అని అన్నారు. ఈసీ నిర్ణయం ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా, రాజకీయ కక్షసాధింపు చర్యగా ఉందన్నారు. కాళీఘాట్‌లోని తన నివాసంలో ఆమె ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ఇప్పటికే నామినేషన్ల పర్వం పూర్తయిన తరుణంలో ఇలాంటి అత్యవసర నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
ఎన్నికల ప్రక్రియను ఆపలేకనే ప్రత్యామ్నాయ పేర్లు, గుర్తులను సమర్పించామని, ఈసీ నిర్ణయాన్ని అంగీకరించలేదన్నారు. ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడతామని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ తనకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలిపారు.
