న్యూఢిల్లీ: బ్రీత్ అనలైజర్ టెస్టుకు నిర్ణీత సమయంలో హాజరుకాకపోవడంతో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ నలుగురు పైలట్లతో సహా 8 మంది సిబ్బందిపై సస్పెన్షన్వేటు వేసింది. దుబాయ్ నుంచి అమృత్సర్ వచ్చిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్‌లోని సిబ్బంది.. శ్రీగురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన రెండు గంటల్లోపే పోస్ట్-ఫ్లైట్ బ్రీత్ అనలైజర్ పరీక్షను చేయించుకోవాల్సి ఉంది. అయితే వారు 35 మినిట్స్ లేట్‌గా (2 గంటల 35 నిమిషాల తర్వాత) డిక్లరేషన్ ఇచ్చారు.
దీనిపై విమానయాన భద్రతా సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆ 8 మందిని విధుల నుంచి తప్పించింది. ఇటీవల ఎయిరిండియాకు చెందిన ఒక పైలట్ ఫుకెట్–-ఢిల్లీ విమాన ప్రయాణం తర్వాత సైకోయాక్టివ్ పదార్థం (మరిజువానా/గంజాయి) సేవించినట్లు తేలింది. ఈనేపథ్యంలో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పైలట్లు, సిబ్బందికి డోప్ టెస్ట్‌ను తప్పనిసరి చేస్తూ కఠిన నిబంధనలు విధించింది.
ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అందరికీ పూర్తి స్థాయి స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. విధులకు ఆటంకం కలిగించే ఎలాంటి మత్తు పదార్థాలనైనా సిబ్బంది స్వచ్ఛందంగా ముందుగానే తెలియజేయాలని (సెల్ఫ్-డిక్లరేషన్) ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ సేఫ్టీ చీఫ్ సూచించారు. ఈ వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
