ఉజ్జయిని: ధర్మం అనేది కేవలం వృద్ధుల వ్యవహారమనే అభిప్రాయం పోతున్నదని.. జెన్-జీ యువత కూడా ప్రస్తుతం ధర్మం గురించి చర్చిస్తుండడం సంతోషంగా ఉందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ధర్మం మనిషి ఆలోచన, ప్రవర్తనలో మార్పుతెస్తుందన్నారు. ధర్మాన్ని నిజంగా అర్థం చేసుకోవాలనుకునేవారు పక్షపాతాలను పక్కన పెట్టాలని యువతకు సూచించారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో శుక్రవారం నిర్వహించిన ‘యువ ధర్మ సంసద్’లో సుమారు 1,700 మంది యువ విద్యార్థులను ఉద్దేశించి భగవత్ ప్రసంగించారు. ధర్మం మన ‘డీఎన్‌ఏ’లోనే ఉందని, మన ప్రవర్తనను, కార్యాచరణను అది నిర్దేశిస్తుందని పేర్కొన్నారు.
మతం కంటే ధర్మం ఉన్నతమైనది
భారతదేశంలో ‘ధర్మం’ అనే భావన.. ఇతర దేశాల్లోని ‘మతం’ (రిలీజియన్) భావనకు పూర్తిగా భిన్నమైనదని మోహన్ భగవత్ అన్నారు. విశ్వాసాలు, మతాల మధ్య భారత్ ఎప్పుడూ వివక్ష చూపలేదని, ఇదే తమకు ‘పంథ్ నిరపేక్షత’ (సెక్యులరిజం) భావన అని చెప్పారు. ‘ధర్మం’, ‘మతం’ రెండూ ఒక్కటి కాదని భగవత్ స్పష్టం చేశారు. మతం కంటే ధర్మం ఉన్నతమైనదని, మతం ఒక వ్యక్తిని ఒక విశ్వాస వ్యవస్థతో అనుసంధానిస్తే.. ధర్మం విముక్తి, మోక్షం వైపు నడిపిస్తుందన్నారు.
