- కార్మికులు, పోలీసుల మధ్య తోపులాట.. అరెస్టు
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాంకీ సంస్థకు ఇంటింటి చెత్త సేకరణ అప్పజెప్పి తమ పొట్టకొట్టొద్దని స్వచ్ఛ ఆటో కార్మికులు శుక్రవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసును ముట్టడించారు. సుమారు 200 మంది కార్మికులు మూడు గ్రూపులుగా వచ్చి ఒక్కసారిగా హెడ్డాఫీసులోకి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుని ఉద్రిక్తతతకు దారి తీసింది. ఈ ఘటనలో తెలంగాణ స్వచ్ఛ ఆటో టిప్పర్ అండ్ రిక్షా కార్మికుల జీహెచ్ఎంసీ ప్రెసిడెంట్ కత్రావత్ గోపాల్ నాయక్ స్పృహ తప్పి కింద పడిపోయాడు.
పోలీసులు ఆయనను వెంటనే నిమ్స్ దవాఖానకు తరలించారు. అంతకుముందు గోపాల్ నాయక్ మాట్లాడుతూ చెత్త సేకరణను రాంకీకి ఇస్తున్నారని తెలిసి మానసికంగా కుంగిపోయి నెలరోజుల్లోనే 10 మంది చనిపోయారని, నలుగురు హాస్సిటల్స్ లో చికిత్స పొందుతున్నారన్నారు. ఈ విషయంలో సీఎం స్పందించి న్యాయం చేయాలన్నారు.తమ సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరించారు.
తమను పాత పద్ధతిలోనే పారిశుద్ధ్య పనుల్లో కొనసాగించాలని, ఎలక్ట్రికల్ ఆటోల పేరుతో పొట్ట కొట్టొద్దన్నారు. కాగా, ఆందోళనకారులను అరెస్ట్చేసిన పోలీసులు నాలుగు బస్సుల్లో చిక్కడపల్లి, చిలకలగూడ పోలీసుస్టేషన్లకు తరలించారు. ఆందోళనలో హంసరాజు, అర్జున్, లక్ష్మన్, రాము, శేకర్, రమేష్, ప్రభాకర్ పాల్గొన్నారు.
