- కోరుట్ల పీఎస్లో లొంగిపోగా, నిజామాబాద్ పోలీసులకు అప్పగించినట్లు సమాచారం
జగిత్యాల/కోరుట్ల, వెలుగు : యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసు నిందితుడైన వైష్ణవి సోదరుడు గంధం సంతోష్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. గురువారం నిజామాబాద్ లో హరిబాబును హత్య చేసి అక్కడి నుంచి పరారైన సంతోష్ రాత్రి ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. తన చెల్లెలు వైష్ణవికి జరిగిన అన్యాయానికి ప్రతీకారంగానే హరిబాబును హత్య చేసినట్లు పేర్కొన్నాడు. మరో వైపు సంతోష్ భార్య సానియా సైతం సెల్ఫీ వీడియో విడుదల చేసింది. వైష్ణవిని హత్య చేసిన వ్యక్తి చనిపోవడం పట్ల సంతోషంగా ఉన్నప్పటికీ, తన భర్త ఇలా చేస్తాడని ఊహించలేదని పేర్కొంది. ఇదిలా ఉండగా నిజామాబాద్ నుంచి పరారైన సంతోష్ కోరుట్ల పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయినట్లు తెలిసింది. సంతోష్ ను కోరుట్ల పోలీసులు నిజామాబాద్ పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.
13 మంది వైష్ణవి కుటుంబ సభ్యులపై ఫిర్యాదు
వైష్ణవి కుటుంబానికి చెందిన 13 మందిపై హరిబాబు కుటుంబ సభ్యులు కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో తమ కుటుంబ సభ్యులను చంపుతామంటూ వీడియోలు పెట్టారని ఆరోపించారు. హరిబాబు హత్యకు సంబంధించి వైష్ణవి కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం హరిబాబు కుటుంబ సభ్యులు, బంధువులు కోరుట్ల పోలీస్ స్టేషన్ సమీపంలోని జాతీయ రహదారిపై హరిబాబు డెడ్ బాడీతో ఆందోళనకు దిగారు.
