భగీరథ నీరు ఇప్పటికీ తాగట్లే..  ఇతర అవసరాలకే ఎక్కువ వినియోగం  

భగీరథ నీరు ఇప్పటికీ తాగట్లే..  ఇతర అవసరాలకే ఎక్కువ వినియోగం  
  •     ఇతర అవసరాలకే ఎక్కువ వినియోగం  
  •     ఆసిఫాబాద్‌‌‌‌ ఏజెన్సీలో దాహం తీర్చుకోవడానికి బోరు, చెలిమె, ప్లాంట్ వాటరే దిక్కు
  •     జిల్లా అంతటా ఇదే తీరు 
  •     భగీరథ నీటి నాణ్యతపై అనుమానంతో తాగేందుకు జంకుతున్న జనం 

ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇంటికి మిషన్‌‌‌‌ భగీరథ నీరు వచ్చినా ఇప్పటికీ తాగడం లేదు. భగీరథ నీటి నాణ్యతపై అనుమానాలు ఉండడంతో తాగేందుకు జనం జంకుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. భగీరథ నీటిని తాగడానికి కాకుండా ఇతర అవసరాలకు ఎక్కువగా వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఏజెన్సీలో దాహం తీర్చుకోవడానికి బోర్లు, చెలిమెలు, వాటర్ ప్లాంట్లే దిక్కువుతున్నాయి. జిల్లాలోని మారుమూల గ్రామాల నుంచి జిల్లా, మండల కేంద్రాలు, పట్టణ ప్రాంతాల వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది.  జిల్లాలోని 27 మండలాలు, సుమారు 1,876 హ్యాబిటేషన్లకు తాగునీరు అందించే లక్ష్యంతో పైపులైన్లు, ఓవర్‌‌‌‌ హెడ్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ రిజర్వాయర్లు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. ఇందుకోసం సుమారు రూ.1,650 కోట్లతో పనులు చేపట్టారు. ఇంత ఖర్చు చేసినా ఇంటింటికీ చేరుతున్న నీటిని ప్రజలు తాగకపోవడంపై అధికార యంత్రాంగం 
దృష్టి సారించడం లేదు. 
నల్లా నీళ్లు ఇతర అవసరాలకు.. 
ఉదయం నల్లా నీటితో బట్టలు ఉతికే మహిళలు.. తాగునీటి కోసం మాత్రం మరో బిందె పట్టుకుని బోరు వద్దకు వెళ్లాల్సి వస్తోంది. నల్లా ద్వారా వచ్చే మిషన్‌‌‌‌ భగీరథ నీటితో పాత్రలు కడగడం, బట్టలు ఉతకడం, బాత్రూం అవసరాలకు వినియోగిస్తున్నారు. కానీ తాగడానికి ప్రత్యేకంగా బోరు నీటిని తెచ్చుకుంటుండగా.. మరికొందరు ఆర్వో ప్లాంట్లు, మినరల్ వాటర్‌‌‌‌‌‌‌‌ క్యాన్లను కొంటున్నారు. మారుమూల గ్రామాల్లో ఇప్పటికే చెలిమెల నీటినే తాగుతున్నారు. దీంతో ప్రభుత్వం ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరు అందించాలనే లక్ష్యం నీరుగారిపోతోందన్న ఆరోపణలున్నాయి. 
నీటి నాణ్యతపై తేలాల్సి ఉంది..!
మిషన్‌‌‌‌భగీరథ నీటిపై జనాలకు కొంత అనుమానాలున్నట్లు తెలుస్తోంది. పైపులైన్ల నిర్వహణ, సరఫరాలో ఎక్కడైనా నీరు కలుషితం అవుతుందన్న భయమా? లేక తరతరాలుగా బోరు, బావి నీటినే వాడుతున్న అలవాటు వల్ల ఆసక్తి చూపడం లేదా? అన్నదానిపై అధికారులు సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. భగీరథ నీటి నాణ్యతపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకపోవడం కూడా నమ్మకం తగ్గడానికి కారణంగా కనిపిస్తోంది. నీటిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎలా శుద్ధి చేస్తున్నారు, నాణ్యత పరీక్షలు ఎలా నిర్వహిస్తున్నారు, ఆయా గ్రామాలు, కాలనీలకు చేరే వరకు నీటి ప్రమాణాలు ఎలా ఉంటున్నాయన్న వివరాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. భగీరథ నీరు సురక్షితమేనని అధికారులు చెబుతున్నప్పటికీ, నీటి నాణ్యత పరీక్షలు చేసి, ఆయా రిపోర్టులను బహిర్గతం చేస్తేనే తాగేందుకు ప్రజలు తాగేందుకు ముందుకు వస్తారు. పాతబడిన పైపులైన్లను మార్చడం, లీకేజీలను అరెస్ట్‌‌‌‌ చేయడం, ఇతర నీటి వనరులతో కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటేనే భగీరథ నీటిపై నమ్మకం పెరిగే అవకాశం ఉంది. 

మిషన్ భగీరథ మురికిగా వస్తున్నాయి. దీంతో ఈ నీరు వస్తున్నప్పటికీ తాగడానికి ఇబ్బందిగా ఉంది. పిల్లలకు తాగించాలంటే భయం వేస్తోంది. ఇప్పటికే బోరు నీళ్లే తాగుతున్నం. పరిశుభ్రమైన తాగునీటిని అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలే.-ఆత్రం పగ్గుబాయి, చెలిమేల కోలంగూడా, తిర్యాణి 

బోర్లు, బావులకే అలవాటు అయిండ్రు

జిల్లాలో మిషన్ భగీరథ నీటి సరఫరా నిరంతరం చేస్తున్నం. కానీ జనం ఆ నీళ్లు తాగడం లేదు. బోర్లు, బావులకే అలవాటు పడ్డారు. మిషన్ భగీరథ నీళ్లు తాగాలని  మండలాల్లో త్వరలోనే అవగాహన కార్యక్రమాలు చేపడతాం. ల్యాబుల్లో టెస్టులు కూడా చేపడుతున్నాం. ప్రజలకు మిషన్ భగీరథ నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి.-సిద్దిక్‌‌‌‌, మిషన్ భగీరథ ఈఈ, ఆసిఫాబాద్