వెలుగు స్పెషల్: సామాన్యుడి జేబుపై యూపీఐ భారం!

వెలుగు స్పెషల్: సామాన్యుడి జేబుపై యూపీఐ భారం!

నా చిన్ననాటి వయసులో మా పెద్దవాళ్లు చెప్పిన మాటలు ఇప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి చక్కగా అన్వయించవచ్చు.   బ్రిటిష్ కాలంలో భారతదేశంలో టీ రుచి ప్రజలకు పరిచయం చేయడానికి దాన్ని రైల్వేస్టేషన్లు,  మార్కెట్లు,  బహిరంగ ప్రదేశాల్లో ఉచితంగా అందించేవారు.  మొదట ఉచితంగా పరిచయమైనది.. క్రమంగా అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు టీ  లేదా కాఫీ లేకుండా రోజు ప్రారంభించడం కష్టంగా మారింది.  

ప్రస్తుతం కేంద్రంలోని  మోదీ  ప్రభుత్వం  కూడా  తొలుత  డిజిటల్ లావాదేవీలు అంటూ యూపీఐ  చెల్లింపులను ప్రోత్సహించి ఇప్పుడు వాటిపై చార్జీలు విధిస్తూ సాధారణ  ప్రజలపై భారం మోపేందుకు సిద్ధమైంది.  నగదు రహితంగా, వేగవంతంగా,  సులభ తరహాలో  ప్రజలకు అందుబాటులో ఉంటూ విస్తృతంగా విస్తరించిన యూపీఐ లావాదేవీలపై  నిత్యం కోట్లాది మంది ఆధారపడుతున్న  సమయంలో ఈ చెల్లింపులపై  కేంద్ర ప్రభుత్వం అదనపు వ్యయం చార్జీలు మోపడంతో  అది  వినియోగదారులపై కొత్త ఆర్థిక భారానికి దారితీయడం ఖాయం.

మర్చంట్ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్‌‌‌‌‌‌‌‌

యూపీఐ విశ్వవ్యాప్తంగా భారత సామర్థ్యానికి గుర్తింపుగా నిలిచాయని,  రియల్ టైమ్ డిజిటల్ లావాదేవీల్లో భారత్ ప్రపంచంలోనే ముందంజలో ఉందని ఇదంతా తమ విజయమని నిత్యం గొప్పలు చెప్పుకునే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు పరోక్షంగా ప్రజలపై భారం వేయడానికి సిద్ధమైంది. యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్  విధించే అంశం చర్చకు వచ్చినప్పుడు ఇలాంటి ప్రతిపాదనలేమీ లేవని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ 2025 జూన్ 11న  స్పష్టత ఇచ్చి, ఇప్పుడు భారం మోపుతోంది.  

తాజాగా  ఎన్పీసీఐ  ప్రకటించిన కొత్త విధానం ప్రకారం అక్టోబర్ 15, 2026 నుంచి అర్హత కలిగిన వ్యాపారులకు  రూ.2,000కు మించిన యూపీఐ పర్సన్- టు -మర్చంట్ లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) అమలులోకి రానుంది. ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.300 పరిమితి విధించడంతోపాటు కొన్ని ప్రత్యేక రంగాలకు వేరే ఫీజు నిర్మాణం ఉంటుందని ప్రకటించారు. లోక్‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

వినియోగదారుడే భరించాల్సి వస్తుందా?

‘వినియోగదారుడిపై నేరుగా చార్జీ లేదు’ అన్న ప్రభుత్వ వాదనకు, ‘భవిష్యత్తులో పరోక్ష భారం పడే అవకాశం ఉంది’ అన్న ఆందోళనకు మధ్య తేడా కనిపిస్తుంది.  చెల్లింపు సమయంలో వినియోగదారుడి యూపీఐ యాప్‌‌‌‌లో అదనపు రూ.40 చార్జీ  కనిపించకపోవచ్చు. కానీ అదే రూ.40ను వ్యాపారి వస్తువు ధరలో కలిపితే, సేవా రుసుములో సర్దుబాటు చేస్తే, యూపీఐకి బదులుగా  నగదు చెల్లించాలని కోరితే, అప్పుడు భారం చెల్లింపు నేరుగా కనిపించకపోయినా,  వినియోగదారుడి మొత్తం ఖర్చులో  ప్రతిబింబించడం ఖాయం.   ఇప్పుడు ఈ చార్జీల భారాన్ని బ్యాంకులు, పేమెంట్ యాప్‌‌‌‌లు, పెద్ద వ్యాపార సంస్థలు తీసుకుంటాయా? లేదా చివరికి వస్తువులు, సేవల ధరల రూపంలో సామాన్య వినియోగదారుడే భరించాల్సి వస్తుందా? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం అవసరం.  

‘డిజిటల్ ఇండియా’పై మోదీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి

ఒకప్పుడు ‘డిజిటల్ ఇండియా’కు ప్రతీకగా,  ప్రపంచానికి భారత్ చూపించిన డిజిటల్ న‌‌‌‌మూనాగా యూపీఐని గర్వంగా ప్రస్తావించిన మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు అందులోనే చార్జీలు విధించడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనం. రూ.2000 లావాదేవీలపై కేవలం 0.40 శాతం చార్జీయే అని, అది కూడా నేరుగా ప్రజలపై పడదని ప్రభుత్వం ప్రకటిస్తున్నా అనేక అనుమానాలున్నాయి.  యూపీఐ వినియోగం మరింత విస్తరించేకొద్దీ దాని ఆర్థిక ప్రభావం కూడా పెరగవచ్చు.  

యూపీఐ లావాదేవీలతో వ్యాపారిపైపడే ఖర్చు ధరల పెరుగుదల, సేవా రుసుములు లేదా చెల్లింపు విధానాల మార్పు రూపంలో వినియోగదారుడిపై పడదని ప్రభుత్వం కచ్చితమైన స్పష్టత ఇవ్వాలి.  2016లో నోట్ల రద్దు నిర్ణయంతో  ప్రజలకు అసౌకర్యం కలిగించి లక్ష్య సాధనలో పూర్తిగా విఫలమైన  మోదీ  ప్రభుత్వం,  దాన్ని కప్పిపుచ్చుకునేందుకు డిజిటల్ లావాదేవీలను  ప్రోత్సహిస్తున్నట్టు ప్రకటించింది. ప్రజలకు అలవాటు చేసి ఇప్పుడు చార్జీలు విధిస్తోంది.  

ప్రతిపక్ష నేతల, సంబంధిత రంగాల మేధావుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఒంటెత్తు పోకడలతో నోట్లరద్దు నిర్ణయం తీసుకొని  ప్రజలను ఇబ్బంది పెట్టిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలి.    వ్యాపారులపై విధించే ఎండీఆర్  చివరికి వినియోగదారుడి జేబుపై పడకుండా ప్రభుత్వం స్పష్టమైన రక్షణ చర్యలు తీసుకోవాలి.  వాటిపై ప్రజలకు  స్పష్టతనివ్వాలి.  

‘ఉచిత యూపీఐ’గా ప్రపంచానికి పరిచయం చేసిన వ్యవస్థ  భవిష్యత్తులో క్రమంగా  చార్జీల వేదికగా మారకుండా పారదర్శక విధానం అవసరం.  లేకపోతే  సౌకర్యంగా మారిన డిజిటల్ చెల్లింపే సామాన్యుడికి మరో అదనపు భారంగా మారే ప్రమాదం ఉంది.  సాధారణ ప్రజలకు భారంకానున్న యూపీఐపై చార్జీ విధింపు నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలి.

అమెరికా ఒత్తిళ్లకు మోదీ  ప్రభుత్వం  తలొగ్గిందా?

విదేశీ వ్యవహారాల్లో పూర్తిగా విఫలమవుతున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ ప్రయోజనాలను పణంగా పెడుతోంది.  ఇప్పుడు అదే తరహాలో  భార‌‌‌‌త్‌‌‌‌లో యూపీఐపై చార్జీలతో మరోసారి అగ్రరాజ్యం అమెరికా ఒత్తిళ్లకు బీజేపీ  ప్రభుత్వం  తలొగ్గిందా అనే అనుమానాలున్నాయి.  అమెరికాకు చెందిన వీసా,  మాస్టర్ కార్డు వంటి బ‌‌‌‌డా సంస్థలు యూపీఐతో పోటీపడేందుకు వీలు కల్పించేలా మోదీ ప్రభుత్వం దేశ ప్రజలపై భారం మోపుతోందనే అనుమానాలున్నాయి.  

గతంలో  అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం భారతదేశంలో ఉచితంగా యూపీఐ సేవలుండడంతో అమెరికన్ ఎలక్ట్రానిక్ పేమెంట్ సంస్థల మార్కెట్ అవకాశాలు దెబ్బతింటున్నాయని అభిప్రాయపడిన నేపథ్యంలో...  ఇప్పుడు మోదీ ప్రభుత్వం వారికి అనుకూలంగా చార్జీల విధింపు నిర్ణయం తీసుకుందా అనే సందేహాలు వస్తున్నాయి. మరోవైపు భారత్‌‌‌‌పై 100 శాతం టారిఫ్  విధించేందుకు అమెరికా సిద్ధమవుతున్నా చేష్టలుడిగి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్న బీజేపీ ప్రభుత్వం సొంత ప్రజలపై యూపీఐ చార్జీలేయడం దుర్మార్గం. 

- బి.మహేశ్ కుమార్ గౌడ్,
ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు 
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
 [email protected] 
రచన 700 పదాలకు మించరాదు.