వెలుగు స్పెషల్ : హసీనా అప్పగింతపై.. భారత్‌‌‌‌‌‌‌‌ నిర్ణయం ఏంటి?

వెలుగు స్పెషల్ :  హసీనా అప్పగింతపై.. భారత్‌‌‌‌‌‌‌‌ నిర్ణయం ఏంటి?

బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ ప్రధాని తారిఖ్‌‌‌‌‌‌‌‌ రెహమాన్‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌  పర్యటనను.. షేక్‌‌‌‌‌‌‌‌ హసీనాను  తమకు అప్పగించాలన్న డిమాండ్‌‌‌‌‌‌‌‌తో  ఢాకా ముడిపెడుతోంది. ఇదే సమయంలో  సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 2న ‘ది ప్రింట్‌‌‌‌‌‌‌‌’కు ఇచ్చిన ప్రత్యేక టెలిఫోన్‌‌‌‌‌‌‌‌ ఇంటర్వ్యూలో హసీనా డిసెంబరులో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌కు తిరిగి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సూచించారు. దీంతో  హసీనా అప్పగింతపై  భారత్‌‌‌‌‌‌‌‌  తీసుకోవాల్సిన  నిర్ణయం మరోసారి  చర్చనీయాంశమైంది.  

ఒక సార్వభౌమ దేశం తన దేశంలో నేరాలకు పాల్పడినట్లు  ఆరోపణలు  ఎదుర్కొంటున్న లేదా దోషిగా  నిర్ధారించిన వ్యక్తిని అప్పగించమని కోరడం  సహజమే.  కానీ  హసీనా అప్పగింతపై నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదు.  పూర్వాపరాల్లోకి వెళితే 2024 ఆగస్టులో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తీవ్రం కావడంతో  ప్రధాని పదవికి రాజీనామా చేసి వచ్చిన  హసీనాకు  భారత్‌‌‌‌‌‌‌‌  ఆశ్రయమిచ్చింది.  అనంతరం  బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌లోని ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌  క్రైమ్స్‌‌‌‌‌‌‌‌ ట్రైబ్యునల్‌‌‌‌‌‌‌‌లో  ఆమెపై  విచారణ జరిగింది. 

పేరులో ‘ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌’ అని ఉన్నప్పటికీ ఇది ఐక్యరాజ్యసమితి లేదా అంతర్జాతీయ న్యాయస్థానంతో  సంబంధం లేని, బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ దేశీయ చట్టం కింద పనిచేసే ప్రత్యేక ట్రైబ్యునల్‌‌‌‌‌‌‌‌ మాత్రమే. ఆమె విచారణకు  హాజరుకాకపోవడంతో,  ఆమె గైర్హాజరీలోనే విచారణ కొనసాగి చివరకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు, ఆమె ఈ తీర్పుపై అప్పీలు కోరలేదు. ట్రైబ్యునల్‌‌‌‌‌‌‌‌లో జరిగిన విచారణ, న్యాయప్రక్రియ పారదర్శకత, విధివిధానాలపై అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు పలు సందేహాలు లేవనెత్తాయి. 

ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం ఏం చెబుతోంది?

బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ వాదనకు చట్టపరమైన ఆధారం ఉంది. భారత్‌‌‌‌‌‌‌‌, బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌లు 2013లో  కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ఒక దేశంలో  నేరారోపణలు ఎదుర్కొంటున్న  లేదా శిక్షపడిన వ్యక్తిని అప్పగించవలసిందిగా  మరో  దేశం  కోరవచ్చు.  హసీనా విషయంలో  ఢాకా కోరుతున్నది  కూడా అదే.  ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌  క్రైమ్స్‌‌‌‌‌‌‌‌ ట్రైబ్యునల్‌‌‌‌‌‌‌‌ దోషిగా నిర్ధారించిన వ్యక్తిని తిరిగి తమకు అప్పగించాలన్నది ఢాకా అభ్యర్థన.  అయితే ఈ ఒప్పందం.. అప్పగింత అభ్యర్థనను తిరస్కరించడానికి అవకాశం కల్పించే కొన్ని కారణాలను కూడా పొందుపరచింది.  ముఖ్యంగా ఆర్టికల్‌‌‌‌‌‌‌‌ 6లో రాజకీయ నేరారోపణలకు సంబంధించి కొన్ని మినహాయింపులు ఉన్నాయి.  

కానీ హసీనా విషయంలో ఆ మినహాయింపులను నేరుగా వర్తింపజేయడం కుదరదు. ఎందుకంటే ఆమెపై ఉన్న ఆరోపణలు తీవ్ర నేరాలకు సంబంధించినవిగా బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ పేర్కొంటోంది. పైగా, ఆమె విచారణకు హాజరు కాకపోవడం చేత, ‘ఇది ఒక మాజీ ప్రధానిపై జరిగిన రాజకీయ కుట్ర’ అని సూత్రీకరించే అవకాశం కూడా అంతంత మాత్రమే. గైర్హాజరీలో విచారణ జరిగిందన్న కారణంతో ఆ తీర్పును భారత్‌‌‌‌‌‌‌‌ తిరస్కరించగలదా అన్నది కూడా జటిలమైన ప్రశ్నే.‌‌‌‌‌‌‌‌ ఎందుకంటే విచారణకు  హాజరు కాకూడదన్నది ఆమె స్వచ్ఛంద నిర్ణయం. ఈ సందర్భంలో ఒప్పందంలోని ఆర్టికల్‌‌‌‌‌‌‌‌ 8 కీలకమవుతుంది. అప్పగింతను తిరస్కరించగల కారణాల్లో ఒకటిగా ‘అప్పగింత అభ్యర్థన అన్యాయమైనది లేదా  దమననీతితో  కూడుకున్నది’ అనే కొలమానాన్ని ఈ ఆర్టికల్‌‌‌‌‌‌‌‌ నిర్దేశించింది. ఈ ప్రామాణికాన్ని హసీనా విషయంలో ఎలా అర్థం చేసుకోవాలి?  

మానవీయ కోణం, నైతికత, భారత్‌‌‌‌‌‌‌‌ ఇచ్చే సందేశం

హసీనాను అప్పగిస్తే  ఎదురయ్యే పరిణామాలను కూడా భారత్‌‌‌‌‌‌‌‌ అంచనా వేయాలి.  ఇప్పటికే  మరణశిక్షకు గురైన వ్యక్తిగా,  ఆమె బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ చేరిన వెంటనే శిక్ష అమలయ్యే అవకాశాన్ని  తోసిపుచ్చలేం. అందువల్ల అప్పగింతకు ముందు ఆమెకు సమర్థవంతమైన అప్పీల్‌‌‌‌‌‌‌‌ అవకాశం ఉందా,  విచారణ పారదర్శకంగా, దేశీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి జరగడానికి వీలయ్యే పరిస్థితులు ఉన్నాయా తదితర అంశాలను పరిశీలించాలి. బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ క్రైమ్స్‌‌‌‌‌‌‌‌ ట్రైబ్యునల్‌‌‌‌‌‌‌‌ విచారణలపై హ్యూమన్‌‌‌‌‌‌‌‌ రైట్స్‌‌‌‌‌‌‌‌ వాచ్‌‌‌‌‌‌‌‌ సహా అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో ఈ ప్రశ్నలు మరింత ప్రాధాన్యత సంతరించుకుంటాయి. 

ఇది హసీనాను నిర్దోషిగా ప్రకటించడం కాదు. భారత్‌‌‌‌‌‌‌‌కు ఆ అవకాశం కానీ, అవసరం కానీ లేదు. ఆమెపై ఉన్న నేరారోపణలకు ఆమె సమాధానం చెప్పాల్సిందే. అదే సమయంలో హసీనాకు భారత్‌‌‌‌‌‌‌‌తో ఉన్న గత సంబంధాలు మన నిర్ణయాన్ని ప్రభావితం చేయకూడదు. అలాగే  ప్రస్తుత ఢాకా ప్రభుత్వంతో సంబంధాలను మెరుగుపరచుకోవాలన్న ఆతృతతో ఆమె హక్కులను,  నైతిక బాధ్యతను విస్మరించడమూ సరైంది కాదు. భారత్‌‌‌‌‌‌‌‌  తీసుకోబోయే నిర్ణయం ప్రమాణాలకు, పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి.   అదే భారత్‌‌‌‌‌‌‌‌  పొరుగుదేశాలకు ఇచ్చే సందేశం కూడా. ఈ రోజు హసీనా,   రేపు మరో పొరుగుదేశ మాజీ పాలకుడు కావచ్చు.  అధికార మార్పు తర్వాత భారత్‌‌‌‌‌‌‌‌ను  ఆశ్రయించే  నాయకుల విషయంలో ఢిల్లీ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయన్న దానికి ఈ వ్యవహారం ఒక ఉదాహరణగా నిలుస్తుంది.  మిత్రుడైనా, ప్రత్యర్థి అయినా- న్యాయ ప్రక్రియ, మానవీయ పరిణామాల విషయంలో ఒకే కొలమానం ఉంటుందన్న  సందేశమే భారత్‌‌‌‌‌‌‌‌ అందించాలి.

బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌తో  దీర్ఘకాలిక సంబంధాలు, మన ప్రయోజనాలు

హసీనా బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ మాజీ ప్రధాని. అయినా ప్రస్తుతం ఆమె తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ముద్దాయి.  ఒక  ట్రైబ్యునల్‌‌‌‌‌‌‌‌  ఆమెను  దోషిగా  కూడా నిర్ధారించింది.  అయితే,  బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ మాత్రం భారత్‌‌‌‌‌‌‌‌కు శాశ్వత పొరుగుదేశం.  అందువల్ల ఆమె విషయంలో  తీసుకునే నిర్ణయం ఢాకాతో  మన భవిష్యత్‌‌‌‌‌‌‌‌ సంబంధాలపై చూపబోయే ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.  బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌తో  మనకు 4,000 కిలోమీటర్లకు పైగా సరిహద్దు ఉంది.  ఈశాన్య భారతదేశానికి  ప్రజారవాణా, వాణిజ్య,  సరిహద్దు భద్రత, ఇంధనం, నదీజలాలు వంటి అంశాల్లో  పరస్పర ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. 

అంతేకాక భారత్‌‌‌‌‌‌‌‌తో దూరం పెరిగితే బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌,  చైనా, పాకిస్థాన్‌‌‌‌‌‌‌‌లకు మరింత చేరువయ్యే అవకాశాన్ని కూడా  తోసిపుచ్చలేం.  హసీనాతో  భారత్‌‌‌‌‌‌‌‌  ప్రభుత్వానికి  గత  రెండు దశాబ్దాలుగా సన్నిహిత  సంబంధం ఉంది. కానీ బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌లో రాజకీయ మార్పు తర్వాత ఆ సమీకరణం మారింది.  ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వంతో భారత్‌‌‌‌‌‌‌‌  సత్సంబంధాలు కొనసాగించాలన్నది  నిర్వివాదాంశం. అందువల్ల హసీనా అప్పగింత అంశాన్ని భావోద్వేగాలతో ముడిపెట్టి, అది రెండు దేశాల మధ్య శాశ్వత వివాదంగా మారకుండాభారత్‌‌‌‌‌‌‌‌ సముచిత నిర్ణయం తీసుకోవాలి. 

ద్వైపాక్షిక సంబంధాలు కాపాడుకోవాలి

కేవలం  ద్వైపాక్షిక సంబంధాల కోసం ఆమెను అప్పగించడం కూడా పరిణతితో  కూడిన నిర్ణయం కాదు. అలా చేస్తే  భారత్‌‌‌‌‌‌‌‌  నైతికత కంటే తక్షణ  దౌత్య ప్రయోజనాలకే  పెద్దపీట వేస్తుందనే  అపవాదు మూటగట్టుకోవాల్సి ఉంటుంది.  అందువల్ల  ద్వైపాక్షిక ఒప్పందం,  నైతికత  ప్రమాణాల ఆధారంగా  హసీనాను బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌కు  అప్పగించాల్సి వస్తే,  ఆ నిర్ణయం వల్ల ఇరుదేశాల సంబంధాలపై పడే ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు భారత్‌‌‌‌‌‌‌‌ సిద్ధంగా ఉండాలి. హసీనా వ్యవహారాన్ని పరిష్కరిస్తూనే  అది  ప్రస్తుత బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ పాలకులకు రుచించినా,  రుచించకపోయినా  ఆ దేశంతో దీర్ఘకాలిక సంబంధాలను దెబ్బతినకుండా కాపాడుకోవడంలో భారత్‌‌‌‌‌‌‌‌ కత్తి మీద సాము చేయాలి.  అయితే, భారత్‌‌‌‌‌‌‌‌ విస్మరించలేని మరో దౌత్య కోణం కూడా ఉంది. 

 హసీనాను అప్పగించడం వల్ల బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌తో సంబంధాలు తప్పనిసరిగా మెరుగుపడతాయన్న హామీ లేదు. అప్పగించకపోవడం వల్ల అవి తప్పనిసరిగా దెబ్బతింటాయని భావించడమూ సరికాదు.  హసీనా తానే డిసెంబరులో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌కు తిరిగి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సూచించిన నేపథ్యంలో ఆమె అప్పగింతను భారత్‌‌‌‌‌‌‌‌–బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ సంబంధాల మొత్తం భవిష్యత్తుకు ప్రాతినిధ్యం వహించే అంశంగా చూడటం మరింత అవసరం. కాబట్టి,  హసీనా అంశాన్ని భారత్‌‌‌‌‌‌‌‌–బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ విస్తృత ద్వైపాక్షిక సంబంధాల్లో కేవలం ఒక భాగంగానే పరిగణించి తదనుగుణంగా ఆచితూచి అడుగులు వేయాలి. 

కృష్ణ బాలాజీ పల్లపోతు,
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన 
మెయిల్​ ఐడీ [email protected] 
రచన 700 పదాలకు మించరాదు.