సూపర్ ఎల్‌నినో 2026/27లో సంభవించవచ్చని అంచనా. ‘సూపర్’ ఎల్‌నినో కేవలం ఒక వాతావరణ సంఘటన కాదు. అది భూమి, సముద్ర, భూఉపరితల, మంచినీటి, జీవావరణ వ్యవస్థలపై బహుళస్థాయి ప్రభావాలను కలిగించే ఒక గ్లోబల్ ఎకలాజికల్ షాక్‌గా మారే అవకాశం ఉంది. గత అనుభవాలతో పోలిస్తే మరింత తీవ్రతతో ఉష్ణోగ్రత పెరుగుదల, రుతుపవనాల్లో అస్థిరత, సముద్ర ఉష్ణ తరంగాలు, జీవావరణ వ్యవస్థల విఘాతం సంభవించవచ్చని శాస్త్రీయ అంచనాలు సూచిస్తున్నాయి.
ఈ పరిస్థితి.. మనం ఇప్పటివరకు ఉపయోగించిన సాధారణ పరిశోధన, ప్రతిస్పందన నమూనాలను పునర్విమర్శించాల్సిన అవసరాన్ని స్పష్టంగా సూచిస్తోంది. ఈ నేపథ్యంలో పర్యావరణ శాస్త్రవేత్తలు, పరిశోధనా సంస్థలు, పరిరక్షణ నిర్వాహకులు, పౌరశాస్త్ర సమూహాలు కలిసి పనిచేసే ఒక సమన్వయ ‘ప్రివెంటివ్ ఎకలాజికల్ రెస్పాన్స్ ఫ్రేమ్‌వర్క్’ను తక్షణమే రూపొందించడం అత్యవసరం.
వేగంగా స్పందించే వ్యవస్థను నిర్మించాలి
వాతావరణ మార్పును కేవలం విశ్లేషించే దశ నుంచి ముందుకువెళ్లి... దాని ప్రభావాలను ముందుగానే అంచనావేసే, క్రమంగా పర్యవేక్షించే, వేగంగా స్పందించే వ్యవస్థను నిర్మించాలి. మొదటగా, స్థానిక స్థాయి పర్యావరణ డేటా సేకరణను బలోపేతం చేయాలి. రిమోట్ సెన్సింగ్ మాత్రమే సరిపోదు. సూక్ష్మస్థాయిలో ఉష్ణోగ్రత, వర్షపాతం, ఆర్ద్రత, నేల పరిస్థితులు, నీటి నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ అవసరం.
ప్రతి దీర్ఘకాలిక పర్యావరణ అధ్యయనాన్ని ఎల్ నినో సందర్భంలో కొనసాగించడం ద్వారా, మార్పుల ప్రభావాన్ని గత డేటాతో పోల్చే అవకాశాన్ని పెంచాలి. రెండోది, ఇప్పటికే ఉన్న పరిశోధనలను ఒక ‘కాంటెక్స్ట్-బేస్డ్ ఎక్స్‌టెండెడ్ స్టడీ’గా విస్తరించాలి. ఫినాలజీ, జీవుల ప్రవర్తన, జనాభా మార్పులు, జీవావరణ పరస్పర చర్యలపై అదనపు డేటాను చేర్చి, వాతావరణ ఒత్తిడికి జీవవ్యవస్థలు ఎలా స్పందిస్తాయో లోతుగా అర్థం చేసుకోవాలి. మూడోది, భౌగోళిక సహకారం అత్యంత కీలకం. భారతదేశంలోని వివిధ ఎకలాజికల్ జోన్లు, పర్వతాలు, తీర ప్రాంతాలు, అడవులు, పట్టణ ప్రాంతాలు అన్నింటిలో ఒకే విధమైన ప్రామాణిక పద్ధతులతో పరిశోధనలు జరగాలి. దీనివల్ల ప్రాంతాల మధ్య తేడాలను శాస్త్రీయంగా అర్థం చేసుకోవచ్చు.
పరిశోధన ఫలితాలను విధాన ప్రక్రియలతో అనుసంధానం చేయాలి
నాలుగోది.. రిమోట్ సెన్సింగ్ ఆర్కైవ్‌లను సమర్థవంతంగా ఉపయోగించి, గత వాతావరణ నమూనాలతో ప్రస్తుత పరిస్థితులను పోల్చే ‘బృహత్తర ప్రామాణిక ఫ్రేమ్‌వర్క్’ను అభివృద్ధి చేయాలి. ఇది భవిష్యత్ ప్రమాదాలను ముందుగానే గుర్తించడానికి సహాయపడుతుంది. ఐదవది, పరిశోధన ఫలితాలను విధాన నిర్ణయ ప్రక్రియలతో అనుసంధానం చేయాలి. ప్రభుత్వ శాఖలు, నిధుల సంస్థలు, స్థానిక పరిపాలన వ్యవస్థలు ఈ డేటాను ఆధారంగా తీసుకుని వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవాలి.
ఈ సూపర్ ఎల్‌నినో మనకు ఒక హెచ్చరిక మాత్రమే కాదు. అది శాస్త్రీయంగా ముందుచూపుతో పనిచేయడానికి ఒక అవకాశం. ప్రతిస్పందనాత్మక విధానాల నుంచి ముందస్తు చర్యల వైపు మారడం ఇక ఎంపిక కాదు, అవసరం. ఇప్పుడు చర్య తీసుకోకపోతే జీవావరణ వ్యవస్థలలో జరిగే నష్టం తిరిగి కోలుకోవడం సాధ్యంకాని స్థాయికి చేరే ప్రమాదం ఉంది. కాబట్టి పర్యావరణ శాస్త్రవేత్తలు ఈ క్షణాన్ని ఒక సమష్టి శాస్త్రీయ ఉద్యమంగా మార్చాలి. ఈ పిలుపు కేవలం పరిశోధన కోసం కాదు. ఇది భవిష్యత్ తరాల జీవన భద్రత కోసం ఒక శాస్త్రీయ బాధ్యత.
రవిబాబు పిట్టల, పర్యావరణవేత్త
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
[email protected]
రచన 700 పదాలకు మించరాదు.
