- దీర్ఘకాలం గుండె పనితీరును పర్యవేక్షించే సాంకేతికత
సైఫాబాద్, వెలుగు : గుండె పనితీరును దీర్ఘకాలం పర్యవేక్షించి, అప్పుడప్పుడు తలెత్తే అసాధారణ మార్పులను గుర్తించేందుకు రూపొందించిన ఏఐ ఆధారిత కార్డియాక్ మానిటరింగ్ టెక్నాలజీ భారత్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. రమణ జాగర్లమూడి తెలిపారు. శుక్రవారం నాంపల్లిలోని ఎఫ్.టి.సి.సి భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన హెల్త్‌టెక్ సంస్థ ‘కార్డీ ఏఐ’ ఈ నెల 26న హైదరాబాద్‌లో దీనిని అధికారికంగా ప్రారంభించనుంది.
ఎఫ్‌టీసీసీఐలో డాక్టర్ రమణ, డాక్టర్ రాఘవేంద్రరావు వివరాలను వెల్లడించారు. తేలికపాటి వేరబుల్ ఈసీజీ చెస్ట్ స్ట్రాప్, మొబైల్ కనెక్టివిటీ, ఏఐ అనలిటిక్స్‌ను ఈ వ్యవస్థలో అనుసంధానించారు. సాధారణ ఈసీజీ లేదా 24 గంటల హోల్టర్ మానిటరింగ్‌లో గుర్తించలేని కొన్ని ఇంటర్మిటెంట్ హార్ట్ అబ్నార్మాలిటీస్‌ను గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది.
యురేషియా మెడికల్ టెక్నాలజీస్ ఎల్‌ఎల్‌పీ సహకారంతో ఈ టెక్నాలజీని భారత్‌లో ప్రవేశపెడుతున్నారు. ఈ పరికరానికి భారత ఎండీ–15 లైసెన్స్‌తోపాటు ఈయూ ఎండీఆర్ క్లాస్–IIఎ సర్టిఫికేషన్ ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. వైద్యుల క్లినికల్ నిర్ణయాలకు ప్రత్యామ్నాయంగా కాకుండా, వారికి సహాయకంగా ఈ వ్యవస్థ పనిచేస్తుందని పేర్కొంది.
