- బాధితుడికి తీవ్ర గాయాలు
- ఫ్లాట్ రిజిస్ట్రేషన్ విషయంలో గొడవే కారణం
ఎల్బీనగర్, వెలుగు: వనస్థలిపురం ఎన్‌జీవోస్ కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున ఓ పాల వ్యాపారిపై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడకు చెందిన భుజంగరావు ఎన్‌జీవోస్ కాలనీలో పాల వ్యాపారం చేస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన శివేందర్ సింగ్ స్టేషనరీ షాపు నిర్వహిస్తున్నాడు. 2017లో గుర్రంగూడలో ఫ్లాట్ కొనుగోలు కోసం శివేందర్ సింగ్.. భుజంగరావుకు రూ.20 లక్షలు చెల్లించాడు. అయితే, ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయలేదంటూ శివేందర్ సింగ్ కోర్టులో పిటిషన్ వేశాడు.
డబ్బులిచ్చినట్లు, ఫ్లాట్కొనుగోలు చేసినట్లు ఆధారాలు లేకపోవడంతో తీర్పు భుజంగరావుకు అనుకూలంగా వచ్చింది. ఈ నేపథ్యంలో డబ్బులు తీసుకొని, తన పేరిట ఫ్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నాడని కక్ష పెంచుకున్న శివేందర్ సింగ్.. కత్తితో దాడి చేయగా.. భుజంగరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వనస్థలిపురం ఏరియా దవాఖానకు తరలించి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఎల్బీనగర్ లోని ఓ ప్రైవేట్హాస్పిటల్కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
