మేడ్చల్ జిల్లా: శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టైర్ పంచర్ కావడంతో వాహనాన్ని రోడ్డుపై నిలిపి టైర్ మారుస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
వాహనాన్ని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన డీసీఎం ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తిని తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. దీంతో ప్రమాదంలో మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు.మృతులు నాచారం ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ప్రమాదంపై శామీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీసీఎం అతివేగమే ప్రమాదానికి కారణమా, ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మృతుల వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
