హైదరాబాద్, వెలుగు: దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను జాతీయ విపత్తుగా పరిగణించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గడిచిన 70 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా ఎండల తీవ్రత పెరిగిందని పేర్కొన్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఎల్‌నినోపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పరస్పర విమర్శలు సరికాదన్నారు.
ఎల్‌నినో ప్రభావంతో ముందుగా నష్టపోయేది రైతులేనని చెప్పారు. గ్లోబల్ వార్మింగ్‌తో భూతాపం పెరిగి ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు. రాష్ట్రాన్ని ప్రకృతి వైపరీత్య ప్రభావిత రాష్ట్రంగా ప్రకటించి, పంట నష్టపోయిన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. నష్టం అంచనాలను రూపొందించి కేంద్రానికి నివేదిక పంపాలన్నారు.
విపత్తు నిర్వహణకు రాష్ట్రం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించడంతోపాటు కరెంట్ కోతలు, భవిష్యత్‌లో మంచినీటి కొరత తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు.
