- కేబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, వెలుగు: కుంభమేళా తరహాలోనే రాబోయే ‘గోదావరి పుష్కరాలు–2027’ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పుష్కరాల అభివృద్ధి పనులన్నింటినీ వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని, ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణతో సమష్టిగా ముందుకెళ్లాలని అధికారులను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో శ్రీధర్‌బాబు అధ్యక్షతన ‘గోదావరి పుష్కరాలు-2027’ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లతోపాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పుష్కరాల సన్నద్ధత, ఆలయాల అభివృద్ధి, ఘాట్ల నిర్మాణం, రవాణా, మౌలిక వసతుల కల్పనపై మంత్రులు సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ గత పుష్కరాల్లో తలెత్తిన సవాళ్లు, సమస్యలు ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ పునరావృతం కావొద్దన్నారు. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, భక్తుల రద్దీ అంచనాలకు తగినట్లుగా పక్కా ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు. సమన్వయ లోపం లేకుండా ఇప్పటికే జిల్లాలవారీగా ప్రత్యేక అధికారులను నియమించినట్లు చెప్పారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే టైర్–1 ప్రాంతాల్లో అత్యాధునిక సాంకేతికతతో కూడిన కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ప్రతి పనికీ డెడ్‌లైన్
పుష్కరాల నాటికి పూర్తయ్యే అవకాశమున్న అత్యవసర పనులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు. చివరి నిమిషం దాకా వేచి చూడకుండా, ప్రతి పనికి ఒక డెడ్‌లైన్ పెట్టుకోవాలన్నారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు వీలుగా ఇంటిగ్రేటెడ్ డ్యాష్‌బోర్డ్‌ను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ఇంజినీర్ల కొరత లేకుండా ఆర్‌అండ్‌బీ, ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై తీసుకోవాలన్నారు. పుష్కరాల సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టాలన్నారు.
