- ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్ లో శాటిలైట్ ఫొటోలతో అధ్యయనం
- భారీ పోలీసు బందోబస్తు
సిద్దిపేట/ములుగు, వెలుగు: మర్కుక్ మండలం ఎర్రవల్లి వద్ద మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ సమీపంలోని భూములను రెవెన్యూ అధికారులు రెండో రోజు పరిశీలించారు. ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్ గ్రామాల పరిధిలోని భూముల సర్వే కోసం ఐదు టీమ్ లను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి 5 టీమ్ లు క్షేత్ర స్థాయిలో సర్వే ప్రారంభించాయి. ఏడీ సుదర్శన్ నేతృత్వంలో నలుగురు డిప్యూటీ ఇన్ స్పెక్టర్ల తోపాటు మర్కుక్ మండల రెవెన్యూ సిబ్బందిని ఐదు టీమ్ లుగా విభజించి రెండు గ్రామాల పరిధిలో భూముల సర్వే చేపట్టారు. మొదటి రోజు ఎర్రవల్లి గ్రామ పరిధిలోని 325 సర్వే నంబర్ లో భూములను పరిశీలించగా, అక్కడి రైతులు కొందరు అధికారులను అడ్డుకున్నారు.
దీంతో రెండో రోజు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సర్వే జరుగుతున్న ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు పెట్రోలింగ్ నిర్వహించారు. ఇదే సమయంలో మర్కుక్ తహసీల్దార్ కార్యాలయంలో శాటిలైట్ మ్యాప్ లు, భూ రికార్డులను పరిశీలించారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ పరిధిలో ప్రభుత్వ భూములు, అసైన్డ్ ల్యాండ్స్ ఏమైనా ఉన్నాయా..? అని పరిశీలిస్తున్నారు. ప్రత్యేక బృందాలు రెండు గ్రామాల పరిధిలో సర్వే నిర్వహిస్తున్నా ఎవరూ అడ్డుకోలేదు. రైతులు, గ్రామస్తులు సర్వేను దూరం నుంచే చూశారు.
ఎర్రవల్లి గ్రామ పరిధిలోని 325 సర్వే నంబర్ లోని 388.5 ఎకరాల భూమికి సంబంధించిన బౌండరీలను నిర్థారించే ప్రక్రియను ప్రారంభించారు. ఈ సర్వే నంబర్ పరిధిలోని కెనాల్ తోపాటు చెరువుల హద్దులను నిర్థారించనున్నారు. ఈ సర్వే నంబర్ లో మోకాపై ఉన్న రైతుల భూములను ఇంకా సర్వే చేయలేదని, వారికి నోటీసులు ఇచ్చిన తర్వాతే సర్వే చేస్తామని ఏడీ సుదర్శన్ తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సి అవసరం లేదన్నారు.
