అటవీ భూములపై రెవెన్యూ జోక్యం వద్దు.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యవహారంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

అటవీ భూములపై  రెవెన్యూ జోక్యం వద్దు.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యవహారంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
  • రెవెన్యూ ఆఫీసర్లకు పట్టాలిచ్చే అధికారం లేదన్న న్యాయస్థానం
  •  ఆక్రమణలను వెంటనే తొలగించాల్సిందేనని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఫారెస్ట్ భూములకు రెవెన్యూ అధికారులు పట్టాలు ఇవ్వడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎంత ఒత్తిడి తెచ్చినా సరే.. అటవీ భూములకు పట్టాలు ఇచ్చే ప్రసక్తే లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. అసలు అటవీ భూములపై రెవెన్యూ అధికారులకు ఎలాంటి హక్కులు ఉండవని స్పష్టం చేసింది.

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌‌నగర్ డివిజన్‌‌లోని అటవీ భూముల వివాదంపై జస్టిస్ అనిల్‌‌కుమార్ జూకంటి ధర్మాసనం విచారణ చేపట్టి ఈ వ్యాఖ్యలు చేసింది. అడవులు పర్యావరణానికి ప్రాణవాయువునిచ్చే ఊపిరితిత్తుల వంటివని, అలాంటి అడవులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని హైకోర్టు గుర్తుచేసింది. అటవీ భూముల విషయంలో రెవెన్యూశాఖ అనవసరంగా తలదూర్చడం అలవాటుగా మార్చుకుందని మండిపడింది. ఫారెస్ట్ అధికారులతో చర్చించకుండా, వారిని సంప్రదించకుండా రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించింది. అటవీ అధికారులను సంప్రదించిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోవాలని స్పష్టం చేసింది.

ఆసిఫాబాద్‌‌ కలెక్టర్‌‌కు సమన్లు

అటవీ భూములు అడవులకే చెందాలని, వాటిని ఇతర అవసరాలకు మళ్లించడం, ఆక్రమణలకు తావివ్వడం సరికాదని హైకోర్టు హెచ్చరించింది. అటవీ భూముల్లో ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగం జారీ చేసిన పట్టాల వ్యవహారంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా వ్యవహరిస్తే సహించేది లేదని తేల్చిచెప్పింది.

అటవీ భూముల్లో ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఆదేశించింది. కాగజ్‌‌నగర్‌‌ డివిజన్‌‌ అటవీ భూముల వ్యవహారంలో నిర్లక్ష్యంపై కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌ కలెక్టర్‌‌కు సమన్లు జారీ చేసింది. ఆన్‌‌లైన్‌‌ ద్వారా విచారణకు స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌‌వో)తో కలెక్టర్‌‌ సమన్వయంతో ఎందుకు చర్చలు జరపడం లేదో పూర్తి వివరాలతో వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. చట్ట నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పులను అధికారులు తూచా తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది.