క్యూనెట్‌ పై సీబీఐ కేసు నమోదు..సిద్దిపేటకు చెందిన బడుగు హరికృష్ణ ఆత్మహత్య కేసులో దర్యాప్తు

క్యూనెట్‌ పై సీబీఐ కేసు నమోదు..సిద్దిపేటకు చెందిన బడుగు హరికృష్ణ ఆత్మహత్య కేసులో దర్యాప్తు
  • క్యూనెట్‌ సంస్థ సహా 16 మంది నిందితులుగా ఎఫ్‌ఐఆర్ నమోదు

హైదరాబాద్‌,వెలుగు: మల్టీ లెవల్ మార్కెటింగ్‌ సంస్థ క్యూనెట్‌ సహా ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల వేధింపుల కేసులో  కీలక పరిణామం చోటుచేసుకుంది.  సిద్దిపేట జిల్లా, వర్గల్ మండలం, వేలూరు గ్రామానికి చెందిన హరికృష్ణ ఆత్మహత్యకు సంబంధించి గురువారం సీబీఐ కేసు నమోదు చేసింది. క్యూనెట్‌ సహా మొత్తం 16 మందిని నిందితులుగా చేర్చింది. బాధితుడి తండ్రి  బడుగు నాగరాజు ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించింది. ఎఫ్‌ఐఆర్‌‌లో పేర్కొన్న వివరాల మేరకు.. బడుగు హరికృష్ణ లోన్ యాప్‌ల నుండి రూ.4 లక్షలు అప్పుగా తీసుకుని, ఆ మొత్తాన్ని ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌లతో పాటు క్యూనెట్‌తో  డిపాజిట్‌ చేశాడు.

 అప్పుల బాధతో గతేడాది అక్టోబర్‌‌ 9న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హరికృష్ణ తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు సిద్దిపేట జిల్లా గౌరారం పోలీసులు కేసు నమోదు చేశారు. హరికృష్ణ ఆత్మహత్యకు లోన్ యాప్స్‌ వేధింపులు కారణం కావడంతో  కేసును మార్చి 4న సీఐడీకి బదిలీ చేశారు.  సీఐడీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ మేరకు సీఐడీ నుంచి కేసు డాక్యుమెంట్లు సేకరించింది. పరిశీలన అనంతరం గురువారం ఎఫ్‌ఐఆర్‌‌ నమోదు చేసింది