- ఎక్కువ మొత్తానికి తాకట్టు పెట్టి.. బాధితులకు తక్కువ డబ్బులు ఇచ్చిన నిందితుడు
- భద్రాద్రి జిల్లా జంగారెడ్డిగూడెం లో ఘటన
అశ్వారావుపేట, వెలుగు : గోల్డ్ లోన్లు ఇప్పిస్తామంటూ ఓ బ్యాంక్ ఉద్యోగి పలువురిని మోసం చేశాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే... పట్టణంలోని జంగారెడ్డిగూడెం రోడ్డులో గల సీఎస్ బీ బ్యాంక్ లో లింగిశెట్టి నాగ సుబ్రహ్మణ్యం పనిచేస్తున్నాడు. డబ్బులు అవసరమైన వారు నాగ సుబ్రహ్మణ్యం కు తమ బంగారం ఇచ్చి బ్యాంక్ లో తాకట్టు పెట్టి లోన్ ఇప్పించాలని కోరేవారు. దీంతో అతడు ఆ బంగారం తీసుకొని.. వారికి కావాల్సిన డబ్బులతో పాటు తాకట్టుకు సంబంధించిన స్లిప్ ఇచ్చేవాడు. తర్వాత ఫేక్ పేపర్లు సృష్టించి ఆ బంగారాన్ని మరో వ్యక్తి పేరుతో ఎక్కువ మొత్తానికి తాకట్టు పెట్టి.. అదనంగా వచ్చిన డబ్బులను తన సొంతానికి వాడుకునేవాడు.
ఇలా పలువురిని మోసం చేసి రూ. 3 కోట్ల వరకు తీసుకున్నాడు. ఇటీవల కొందరు బాధితులు వడ్డీ కట్టేందుకు తమ వద్ద ఉన్న స్లిప్స్ తో బ్యాంకు వెళ్లగా... తమ వద్ద ఉన్న స్లిప్స్ కు బ్యాంక్ లో ఉన్న పేపర్లకు సంబంధం లేకపోవడంతో ఆరా తీయగా అసలు విషయం వెలుగుచూసింది. ఈ విషయం కాస్తా బయటకు పొక్కడంతో బాధితులు శుక్రవారం బ్యాంక్ వద్దకు చేరుకున్నారు. ఈ విషయంపై నాగ సుబ్రహ్మణ్యాన్ని ప్రశ్నించగా.. బ్యాంక్ లావాదేవీల్లో భాగంగా సర్దుబాట్లు చేశానని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం తన వద్ద అంత అంత అమౌంట్ లేదని, కొంత టైం ఇస్తే వస్తువులు విడిపించి ఇస్తానని చెప్పడంతో ఆగ్రహానికి గురైన బాధితులు బ్యాంక్ ఎదుట ఆందోళనకు దిగారు. బ్యాంకు ఉద్యోగులు మాత్రం.. రూల్స్ ప్రకారమే బంగారాన్ని తాకట్టు పెట్టుకున్నామని, తమ వద్ద ఎలాంటి మోసం జరగలేదని చెప్పారు.
