ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఆయనపై అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తూ అసెంబ్లీ స్పీకర్ వెలువరించిన తీర్పును కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2), పదో షెడ్యూల్‌లోని 2(1)(ఎ) ప్రకారం.. దానం నాగేందర్ 2024 ఏప్రిల్ 23 నుంచే శాసనసభ సభ్యుడిగా అనర్హుడని ప్రకటించింది. అదే తేదీన దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫారం తీసుకుని సికింద్రాబాద్ పార్లమెంటు సీటుకు నామినేషన్ వేశారని, బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడం ద్వారా బీఆర్‌ఎస్ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టేనని స్పష్టం చేసింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్టు ప్రకటించింది. స్పీకర్ కార్యదర్శికి, కేంద్ర ఎన్నికల సంఘానికి తీర్పు ప్రతులను పంపించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ తో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం తీర్పు వెలువరించింది.
91 పేజీల తీర్పు
ఈ వ్యవహారంలో స్పీకర్ వద్ద దాఖలైన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడం లేదంటూ గతంలో హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్ జడ్జి ఆదేశాల అనంతరం వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లగా, స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లను నిర్ణీత కాలంలో పరిష్కరించాలని సుప్రీంకోర్టు 2025 జులై 31న ఆదేశించింది. ఆ నేపథ్యంలో దానం నాగేందర్‌పై దాఖలైన పిటిషన్లను స్పీకర్ విచారించి తిరస్కరించారు. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కౌశిక్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తయిన అనంతరం డివిజన్ బెంచ్.. గత ఆగస్టు 21న తీర్పును రిజర్వు చేసి, శుక్రవారం 91 పేజీల తీర్పును వెలువరించింది.
సుప్రీంకు వెళ్లే విషయంలో నిర్ణయం తీసుకోలే: దానం
ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా తనపై హైకోర్టు ఇచ్చిన తీర్పును దానం నాగేందర్ స్వాగతించారు. తీర్పు వెలువడిన అనంతరం ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా పోటీకి తాను సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. ‘ఎన్నికలు నాకు కొత్త కాదు.. నేను ఫైటర్‌ను.. మళ్లీ పోరాడుతా.. మళ్లీ గెలుస్తా..’ అని ధీమా వ్యక్తం చేశారు. ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారనే ప్రశ్నకు ఆయన సమాధానం
దాటవేశారు.
