- నేడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా
- దాదాపు 20వేలమంది నిరుద్యోగులకు ఇంటర్వూలు
- హాజరు కానున్న స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల, కోమటిరెడ్డి
సూర్యాపేట, వెలుగు: నేడు సూర్యాపేట జిల్లాలో నిరుద్యోగుల కోసం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో కోదాడలో మెగా జాబ్ మేళా కోసం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. 300కి పైగా కంపెనీలు ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొంటుండగా 5వేలకు పైగా ఉద్యోగాలు కల్పించనున్నారు.
10వ తరగతి అర్హతతో..
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్), తెలంగాణ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్(డీఈఈటీ) సహకారంతో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఐటీ, ఫార్మా, ఇ-కామర్స్, ట్రేడ్, మాన్యుఫ్యాక్చరింగ్, ఐటీఈఎస్, బీపీఓ, బయోటెక్నాలజీ రంగాలకు చెందిన కంపెనీలు ఇందులో పాల్గొంటాయి. 10వ తరగతి నుంచి ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల వరకు అర్హత కలిగిన అభ్యర్థులు హాజరై కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
క్యూ ఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్
ఈ జాబ్ మేళా ప్రారంభానికి స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరుకానున్నారు. మేళాలో 300 కంపెనీలు వస్తుండగా, 20వేల మందికి పైగా నిరుద్యోగులు పాల్గొననున్నారు. 5వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వనుండగా ఇందుకోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఏర్పాట్లు పూర్తి
ఈ జాబ్ మేళా కోదాడ పట్టణంలోని సెయింట్ జోసెఫ్ సీసీఆర్ విద్యానిలయంలో నిర్వహించనున్నారు. రిజిస్ట్రేషన్ కోసం మేళా వద్ద ప్రత్యేక హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ సేవలు అందించడానికి కంప్యూటర్లు, ప్రింటర్లు, జిరాక్స్ మిషన్‌లు వంటి అవసరమైన సౌకర్యాలు కల్పించారు. భారీ పోలీస్బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక ఎస్పీ, ఒక అదనపు ఎస్పీ, ఆరుగురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 45 మంది ఎస్ఐలు సహా ఉమ్మడి జిల్లాకు చెందిన 600 మంది పోలీస్ సిబ్బంది కలిసి విధులు నిర్వహించనున్నారు. వాహనాల కోసం బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద, లక్ష్మి టీవీఎస్ స్పేర్ పార్ట్స్ షాప్ పక్కన, శ్రీ చైతన్య టెక్నో స్కూల్, జయ స్కూల్, న్యూ విజన్ స్కూల్, శ్రీ చైతన్య స్కూల్, డేగ బాబు ఫంక్షన్ హాల్, రంగారావు ఫంక్షన్ హాల్ పక్కన ఏర్పాటు చేశారు. ఉద్యోగ మేళా ప్రాంగణంలో భద్రత పర్యవేక్షణకు 30 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసందానం చేసి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు.
యువత సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి ఉత్తమ్
చాలా మంది చదువుకున్న యువతీ, యువకులకు సరైన ఉద్యోగాలు రాకపోవడం బాధాకరం. ఈ ప్రాంతంలో కొంతమందికైనా ఉద్యోగాలు ఇప్పించాలనే తపనతో కోదాడలో జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని నియుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి.
