ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర భారీగా భక్తుల రద్దీ... క్యూ లైన్ లో సొమ్మసిల్లి పడిపోతున్న భక్తులు..

ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర భారీగా భక్తుల రద్దీ... క్యూ లైన్ లో సొమ్మసిల్లి పడిపోతున్న భక్తులు..

ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర భారీగా భక్తుల రద్దీ నెలకొంది. శనివారం ( సెప్టెంబర్ 19 ) వీకెండ్ కావడంతో బడా గణేషుడిని చూడటానికి భారీగా తరలి వస్తున్నారు భక్తులు. దీంతో అన్ని క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. ఈ క్రమంలో ఉక్కపోత తట్టుకోలేక క్యూలైన్లలో సొమ్మసిల్లి పడిపోయారు పలువురు భక్తులు. సొమ్మసిల్లిన భక్తులను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు ఉత్సవ సమితి సభ్యులు.

హారతి సమయానికి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. భక్తుల రద్దీని ముందే ఊహించిన పోలీసులు మూడు రోప్ పార్టీలను మోహరించారు. అయితే.. క్యూలైన్లలో ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారని... ఊపిరాడక కొంతమంది కళ్ళు తిరిగి పడుతున్నారని అంటున్నారు. ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించేలా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు భక్తులు.

ఇదిలా ఉండగా.. బడా గణేష్ ను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బంది రాకుండా బడా గణేష్ మండపం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. 

బడా గణేష్ దర్శనం సెప్టెంబర్ 23 వరకు ఉంటుందని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్ తెలిపారు. బడా గణేష్ దర్శానికి సొంత వాహనాల్లో వచ్చే కంటే.. మెట్రో, MMTS, RTC స్పెషల్ బస్సు లలో భక్తులు రావాలని విజ్ఞప్తి చేశారు.