నడిరోడ్డుపై కారు బోల్తా.. మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్

నడిరోడ్డుపై కారు బోల్తా.. మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. ప్రమాదానికి గురైన బాధితురాలిని తన కాన్వాయ్‎లో ఆసుపత్రికి తరలించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. వివరాల ప్రకారం.. శనివారం (సెప్టెంబర్ 19) ఓ ఫ్యామిలీ కారులో సిద్దిపేట నుంచి గజ్వేల్ బయలుదేరింది. ఈ క్రమంలో కారు ప్రమాదవశాత్తూ అదుపుతప్పి నడిరోడ్డుపై బోల్తా పడింది.

ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ఉండగా.. యువతి తీవ్రంగా గాయపడింది. కారు ఎయిర్ బ్యాగ్ తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. సిద్దిపేటలో ఎగ్జామ్ రాసిన కూతురును తల్లిదండ్రులు కారులో గజ్వేల్‎కు తీసుకొస్తుండగా ఘటన చోటు చేసుకుంది.

అదే సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల వెళ్తున్నారు. ప్రమాదాన్ని గమనించిన ఆయన వెంటనే తన కాన్వాయ్‎ను ఆపి భద్రతా సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి వెళ్లి బాధితులని కారులోనుంచి తీశారు. వెంటనే తన కాన్వాయ్‎లోని పోలీస్ వాహనంలో బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.