హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన శాసన సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పును ఆయన దేశ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు. దానం పిటిషన్ సుప్రీం కోర్టులో సెప్టెంబర్ 21న విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు న్యాయవర్గాల ద్వారా తెలిసింది. దానం మొదట తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతించారు.
సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచన లేదని.. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని పేర్కొన్నారు. దీంతో ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయమని తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ దానం సుప్రీం కోర్టు తలుపు తట్టడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దానం పిటిషన్ ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరిస్తుందా..? ఒకవేళ విచారించిన ఎలాంటి తీర్పు ఇస్తుందని స్టేట్ పొలిటికల్ కారిడార్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
దానంపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు:
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఆయనపై అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తూ అసెంబ్లీ స్పీకర్ వెలువరించిన తీర్పును కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2), పదో షెడ్యూల్లోని 2(1)(ఎ) ప్రకారం.. దానం నాగేందర్ 2024 ఏప్రిల్ 23 నుంచే శాసనసభ సభ్యుడిగా అనర్హుడని ప్రకటించింది.
అదే తేదీన దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫారం తీసుకుని సికింద్రాబాద్ పార్లమెంటు సీటుకు నామినేషన్ వేశారని, బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడం ద్వారా బీఆర్ఎస్ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టేనని స్పష్టం చేసింది.
దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్టు ప్రకటించింది. స్పీకర్ కార్యదర్శికి, కేంద్ర ఎన్నికల సంఘానికి తీర్పు ప్రతులను పంపించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ తో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం తీర్పు వెలువరించింది.
