హైదరాబాద్: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు గాంధీభవన్ మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో అతని కాలు విరిగింది. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని యువకుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన సల్మాన్‌ఖాన్ (26) కుటుంబ కలహాల కారణంగా కొంతకాలంగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. తన ఐదేళ్ల కుమారుడిని కూడా కలవనివ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం.
ఈ క్రమంలో ఈ నెల 17న ఇంటి నుంచి బయటకు వెళ్లిన సల్మాన్ తిరిగి రాకపోవడంతో అతడి తల్లి టోలిచౌకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ నెల 18న మిస్సింగ్ కేసు నమోదు చేసి అతడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.
ఇదిలా ఉండగా, శనివారం గాంధీభవన్ మెట్రో స్టేషన్ పై నుంచి సల్మాన్ కిందికి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. కింద పడటంతో కాలుకు తీవ్ర గాయమై ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించగా, సిబ్బంది అక్కడికి చేరుకుని అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
