పెబ్బేరు, వెలుగు : ప్రత్యేక అవసరాల పిల్లలకు భవిత కేంద్రం తోడ్పాటునిస్తుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. విద్య, వ్యవసాయ రంగాల మౌలిక వసతుల బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. శుక్రవారం పెబ్బేరు పట్టణంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని భవిత కేంద్రాన్ని, రూ.44 లక్షలతో పెబ్బేరు మార్కెట్‌యార్డులో పరిపాలనా వ్యవస్థ కోసం నిర్మించిన అదనపు కార్యాలయ గదులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులను గుర్తించి వారి సామర్థ్యాలకు అనుగుణంగా విద్య, శిక్షణ, అవసరమైన సహాయక సేవలు అందించేందుకు భవిత కేంద్రం ఉపయోగపడుతుంతని చెప్పారు. మార్కెట్‌యార్డు పరిపాలనా కార్యకలాపాలకు అదనపు వసతులు అందుబాటులోకి వచ్చాయని, అధికారులు, సిబ్బంది విధులను మరింత సౌకర్యవంతంగా నిర్వహించేందుకు ఈ భవనం ఉపయోగపడనుందన్నారు. మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
వెల్టూరులో తెలంగాణ పబ్లిక్ స్కూల్
వనపర్తి : పెద్దమందడి మండలం వెల్టూరులో రూ.11.75 కోట్లతో సెమీ రెసిడెన్షియల్ విధానంలో అత్యాధునిక పాఠశాల ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన వెల్టూరు గ్రామాన్ని సందర్శించి తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మించనున్న స్థలాన్ని పరిశీలించారు. పాఠశాల ఏర్పాటుకు సంబంధించిన అంశాలను అధికారులతో చర్చించి, విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉండేలా అవసరమైన ఏర్పాట్లపై సూచనలు చేశారు.
