మట్టిని తవ్వితే బయటపడేది కేవలం మట్టి కాదు.. రాళ్లను పరిశీలిస్తే కనిపించేది కేవలం రాళ్లు కాదు.. వాటి వెనుక వేల ఏళ్ల తెలంగాణ చరిత్ర దాగి ఉంటుంది. ఆ చరిత్ర ఆనవాళ్లను వెతుకుతూ.. ఆదిమానవుల ఆవాసాల నుంచి మెగాలిథిక్ కట్టడాల వరకు.. శిలాచిత్రాల నుంచి శాసనాల వరకు.. ఊరూరా తిరుగుతూ చరిత్రను వెలికితీస్తున్నారు జనగామకు చెందిన రెడ్డి రత్నాకర్ రెడ్డి. ఈయన ‘500 డేస్ ఛాలెంజ్ ఆఫ్ మై డిస్కవరీ’ పేరిట తెలంగాణలో చేపట్టిన ఆదిమానవుల ఆనవాళ్ల వేట 530 రోజులుగా కొనసాగుతోంది. ప్రతిరోజూ ఒక కొత్త చారిత్రక, పురావస్తు లేదా వారసత్వ విశేషాన్ని ప్రజలకు పరిచయం చేస్తూ నిరంతర అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ వినూత్న ప్రయాణం ద్వారా వేలాదిమంది విద్యార్థులు, యువత, చరిత్రాభిమానుల్లో పరిశోధనా స్ఫూర్తిని పెంపొందిస్తున్నారు. రోజుకో చారిత్రక విశేషాన్ని వెలుగులోకి తెస్తూ తెలంగాణ చరిత్రను ప్రజలకు చేరువ చేస్తున్నారు.
తెలంగాణ వారసత్వ సంపద పరిరక్షణ, ప్రజల్లో చారిత్రక అవగాహన పెంపొందించాలనే ఉన్నతాశయంతో పురావస్తు పరిశోధకుడైన రెడ్డి రత్నాకర్ రెడ్డి మరో 20 మంది పరిశోధకులతో కలిసి జనగామ కేంద్రంగా మాన్యుమెంట్స్, అనిసెంట్ తెలంగాణ ట్రెడిషన్స్ అండ్ ఇన్స్ట్రిప్టన్స్ ఫౌండేషన్ (మట్టి ఫౌండేషన్)ను ఏర్పాటు చేశారు. ప్రతీ పాఠశాలలో స్థానిక చరిత్ర, వారసత్వం, పర్యావరణం, జానపద సంపద, సామాజిక అధ్యయనాలపై విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించేలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా సోషల్ ల్యాబ్ మూవ్మెంట్ చేపట్టారు. ఈ ఉద్యమం ద్వారా విద్యార్థులు తమ గ్రామాన్నే ఒక పరిశోధనా ప్రయోగశాలగా భావించి నేర్చుకునే విధానాన్ని ప్రోత్సహించడం ఈ ఉద్యమం ప్రధాన లక్ష్యం. పురాతన చారిత్రక ఆధారాలను సేకరించి వాటితో పాఠశాలల్లో మ్యూజియం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో తమ మట్టి ఫౌండేషన్ పనిచేస్తుందని వ్యవస్థాపక అధ్యక్షుడు, పురావస్తు పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి చెప్పారు.
గుట్టల్లో.. గుహల్లో.. రాళ్లపై చరిత్ర వేట
జనగామ జిల్లాలో ఏడు ప్రాచీన వింతలను మట్టి ఫౌండేషన్ పురావస్తు పరిశోధకులు వెలుగులోకి తీసుకువచ్చారు. ఇందులో ఒకటైన భారతదేశంలోని ఎత్తైన మానవాకృత శిల్పం జనగామ జిల్లా వడ్లకొండలో గుర్తించారు. బచ్చన్నపేట మండలం కొడవటూరులో ఉత్తరాయణం, దక్షిణాయనాన్ని సూచించే రాళ్లతోటను గుర్తించారు. ప్రపంచంలోనే అతి బరువైన క్యాప్స్ స్టోన్ ఉన్న సమాధిని జనగామ జిల్లా సిద్ధంకి గుట్ట దిగువన గుర్తించారు. జనగామ జిల్లాలో 50 వరకు శాసనాలను 40కి పైగా నిలువురాళ్లను గుర్తించినట్లు రత్నాకర్ తెలిపారు. జనగామ, సిద్దిపేట జిల్లా శివార్లలో ఉన్న సంగీతం వినిపించే శిలలతో కూడిన సోలామైల్ ఏనెలను పరిశోధించారు. ఈ శిలలపై నవీన శిలాయుగపు రాతి పనిముట్లు నూరుకున్న తావులు, మెగాలిక్ నిర్మాణాలు, గంటు చిత్రాలు గుర్తించారు. ఇవే కాకుండా తెలంగాణలో అరుదైన అయ్యనార్ శిల్పాలను జనగామ జిల్లా ఎల్లంల గ్రామంలోనూ, నల్గొండ జిల్లాలో గుర్తించారు.
ఇల్లే మ్యూజియం
పండితగల్లు, సిడితల వంటి అరుదైన వీరగల్లు శిల్పాలను మట్టి ఫౌండేషన్ పురావస్తు పరిశోధకులు గుర్తించారు. రత్నాకర్ రెడ్డి పరిశోధనలో భాగంగా శిలాయుగం నాటి చారిత్రిక ఆధారాలను సేకరించి తన ఇంటినే ఒక మ్యూజియంగా మార్చారు. తాను సేకరించిన పురాతన చారిత్రక అవశేషాలతో తన ఇంట్లోనే ఒక మ్యూజియం ఏర్పాటు చేశానని చెప్పారు. పురాతన చారిత్రక అవశేషాలను పరిరక్షించడంతోపాటు వాటి గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పారు. పాత రాతి యుగానికి చెందిన రాతి పనిముట్లు, నవీన శిలాయుగం, బృహ శిలాయుగానికి చెందిన రాతి పనిముట్లతో పాటు అనేక రకాల మున్మయ పాత్రలు, నీటిలో తేలే ఇటుక, రింగ్ స్టోన్లు, మట్టిపూసలు, రాతి పూసలు, దంతపు పూసలు, అనేక రకాల నాణేలు ఇలా శిలాయుగం చారిత్రక సంపదను ముందు తరాల కోసం భద్రపరిచారు. ఎన్నో ఏళ్లుగా పురావస్తు మ్యూజియం నిర్మించాలని కోరుతూ తాను ప్రభుత్వానికి వినతి పత్రాలు అందిస్తున్నా సర్కారు నుంచి సరైన స్పందన రావడం లేదని రత్నాకరరెడ్డి ఆవేదనగా చెప్పారు.
ఆదిమానవుల ఆనవాళ్లపై అవగాహన...
తెలంగాణ రాష్ట్రంలో రాతి యుగం నాటి ఆదిమానవుల ఆనవాళ్లు లభించాయని మట్టి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి,పురావస్తు పరిశోధకుడు వినయ్ గోలి వెల్లడించారు. తాను ఎంబీఏ చదివినా పురావస్తు శాస్త్రంపై ఉన్న మక్కువతో మల్టీనేషనల్ కంపెనీలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ఆదిమానవుల జీవనంపై అధ్యయనం చేసేందుకు మట్టి ఫౌండేషన్లో చేరానంటారు వినయ్. నిత్యం తెలంగాణలోని కోటలు, దేవాలయాలు, గుట్టలను సందర్శిస్తూ రాతి యుగానికి సంబంధించిన రాతి పనిముట్లు, పూర్వీకుల శాసనాలను తాము సేకరించి వాటిని నిక్షిప్తం చేస్తున్నామని తెలిపారు. సిద్ధిపేట జిల్లాలోని దాసర్లపల్లి, ములుగు జిల్లాలోని వెంకటాపూర్, వరంగల్ జిల్లాలోని జఫర్ ఘడ్, సూర్యాపేట, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లోని పురాతన కోటలు, ఆలయాలు, కొండలు, గుట్టలను సందర్శిస్తూ నాటి చారిత్రక అవశేషాలను సేకరిస్తున్నామన్నారు. ఒకవైపు పురావస్తు పరిశోధనలు సాగిస్తూనే కాకతీయ యూనివర్సిటీలో చారిత్రకుడిగా, ఇగ్నోలో టూరిజంపై చదువు కొనసాగిస్తున్నానని వినయ్ వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఆదిమానవుల చరిత్రకు సాక్షీభూతంగా ఉన్న పురాతన కోటలు, గుహలు, దేవాలయాలు, కొండలు, గుట్టలు నిలిచాయని, నాటి పురాతన చారిత్రక ఆధారాలను సేకరించి వాటిని భావితరానికి తెలియజేస్తున్నామని మట్టి ఫౌండేషన్ కోశాధికారి, ఔత్సాహిక పురావస్తు పరిశోధకుడు జితేందర్ దేశెట్టి చెప్పారు. తాను చేసేది ఐటీ ఉద్యోగమైనా పురావస్తు పరిశోధనలపై ఆసక్తితో మట్టి ఫౌండేషన్లో కీలక సభ్యుడిగా చేరి వారాంతాల్లో పురాతన స్థలాలను సందర్శిస్తున్నానంటారు జితేందర్. తాను నివాసముంటున్న జనగామ జిల్లాలోని తిరుమలగిరి గ్రామంలోని కోటినాగులగుడి సమీపంలోని ఇంటికి సమీపంలోనే ఆదిమానవుల కాలం నాటి మూడు బండలు, కోటి రాళ్లు, రాతి గొడ్డలి లభించాయని ఆయన తెలిపారు. పురాతన చరిత్రకు నిలయమైన రాకాసిగూళ్లు, పురాతన రాతి పనిముట్లు, శిల్పాలు, శిలా శాసనాలు, రాతి చిత్రాలు సేకరించి వాటిని విద్యార్థులకు చూపించి వారికి చరిత్రపై అవగాహన కల్పిస్తున్నామని జితేందర్ చెప్పారు. జైనులు, బౌద్ధులు, శాతవాహనులు, విష్ణుకుండీనులు, కాకతీయుల కాలంనాటి అవశేషాలను సేకరించి ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నామని చెప్పారు.
‘ప్రైడ్ ఆఫ్ తెలంగాణ’ నామినేషన్
చరిత్ర పుస్తకాల్లో లేని చరిత్రను.. నేలపై వెతుకుతున్న వ్యక్తి. తెలంగాణలోని చారిత్రక కట్టడాలు, ఆదిమానవుల ఆవాసాలు, మెగాలిథిక్ ఆనవాళ్లు, శిలాచిత్రాలు, శాసనాలు, శిల్పకళా సంపదను గుర్తించి.. వాటిని నమోదు చేస్తూ.. పరిరక్షణకు కృషి చేస్తున్నారు జనగామకు చెందిన రెడ్డి రత్నాకర్ రెడ్డి. తెలంగాణ చరిత్ర, పురావస్తు, కళలు, సంస్కృతి, వారసత్వ సంపద పరిరక్షణకు చేస్తున్న సేవలకు గుర్తింపుగా.. మట్టి ఫౌండేషన్ అధ్యక్షుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి ప్రతిష్టాత్మక ‘ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్ 2026’లో కళలు, అండ్ సంస్కృతి విభాగంలో నామినేట్ అయ్యారు. ఏ అవార్డు వచ్చినా రాకపోయినా.. తెలంగాణ నేలలో దాగి ఉన్న చరిత్రను వెలికి తీసే అన్వేషణ మాత్రం ఆగదన్నదే ఆయన ప్రయాణం.
పురాతన ప్రాభవం
- జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా మామిడిగూడెం గ్రామంలోని అతి పెద్ద బృహద్ శిలా యుగం శ్మశాన వాటికను మట్టి ఫౌండేషన్ పురావస్తు పరిశోధకులు కనుగొన్నారు. ఈ సైట్ దేశంలోనే ప్రత్యేకమైంది. ప్రతి సమాధిలో శవ పేటికలు, అస్థికలు, సమాధి ముందు మానవాకృత శిల్పం, వృత్తాకార నీటి గోలెం ఉన్నాయి.
- ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలం బండ్లపహాడ్ గ్రామం పరిధిలో సామాన్య శక పూర్వం 30 వేల ఏళ్ల కిందటి సీమాటిక్ అవశేషాలను గుర్తించారు. ఇవి భారత దేశపు అతి పురాతన చిత్రాలు. ఈ ప్రాంతంలో పాతరాతి యుగం నాటి రాతి పనిముట్లను మట్టి ఫౌండేషన్ గుర్తించింది.
- సిరిసిల్ల జిల్లా గన్నెవారిపల్లి శివారులో కంగారు జంతువును పోలిన చిత్రం, ఇతర చిత్రాలను గుర్తించింది.
- జనగామ జిల్లా జాఫర్ గడ్ మండల కేంద్రంలోని వేల్పుగొండ గుట్టపై విష్ణు కుండినుల రాజ చిహ్నం పంజా ఎత్తి లంగిస్తున్న గంటు చిత్రంతో పాటు శిల్పాన్ని గుర్తించింది.
- నవీన శిలాయుగం నాటి రాతి పనిముట్లను నూరుకునే తావులు, ధాన్యాన్ని నూరుకునే తావులు, ఇతర చిత్రాలను గుర్తించింది.
- హనుమకొండ జిల్లా కేంద్రంలో ఉన్న అగ్గలయ్య గుట్టపై అపరిష్కృత శాసనంతో పాటు, గంటు చిత్రంగా ఉన్న తీర్థంకరుడిని గుర్తించింది.
- తొలిసారిగా గుట్టపై ఫైర్ క్యాంప్ వేసి, నగరంపై నుంచి సూర్యోదయాన్ని చూడటానికి అనువుగా ఉంటుందని పేర్కొంది.
- జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాలో పాండవులగుట్టపై తొలిసారిగా మూషిక జింక చిత్రాన్ని గుర్తించారు.
- నారాయణపేట జిల్లాలో మట్టి ఫౌండేషన్ బృందం 2 వేల ఏళ్ల కిందటిదిగా భావిస్తున్న ముడుమాల అంతరిక్ష పరిశోధన కేంద్రం సందర్శించింది.2 వేల ఏళ్ల కిందటి చరిత్ర ఉందని గుర్తించింది.
- మట్టి ఫౌండేషన్ సభ్యులైన కె. ప్రశాంత్, వినయ్ గోలితో కలిసి నల్గొండ, సూర్యాపేట జిల్లాలో పర్యటించి, కాకతీయ మూల పురుషుడైన వెన్న నృపుడి గ్రామాన్ని గుర్తించడంతో పాటు గుండియ రాష్ట్రకూట, ఎరియ రాష్ట్రకూట, బేతరాజు మొదలైన కాకతీయ తొలి పాలకుల పేరు మీద ఏర్పడిన గ్రామాలను గుర్తించారు.
