ఒకప్పుడు క్లబ్ అంటే పార్టీలు.. జిమ్ అంటే వర్క్అవుట్.. స్పా అంటే రిలాక్సేషన్! కానీ ఇప్పుడు సీన్ మారింది. హైదరాబాద్‌లో ఫిట్‌నెస్‌తోపాటు మైండ్‌ఫుల్‌నెస్.. వర్క్అవుట్తో పాటు సోషల్ కనెక్షన్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. యోగా.. మెడిటేషన్.. రన్నింగ్.. పికిల్‌బాల్.. హెల్దీ ఫుడ్.. వీకెండ్ యాక్టివిటీస్.. ఇలా అన్నింటినీ ఒకే లైఫ్‌స్టైల్‌గా మార్చేస్తున్నాయి వెల్‌నెస్ కమ్యూనిటీలు. అసలు హైదరాబాద్‌లో ఈ కొత్త వెల్‌నెస్ కల్చర్ ఎందుకు పెరుగుతోంది? నగరవాసులను ఇంతగా ఆకట్టుకుంటున్న ఈ కొత్త ట్రెండ్ ఏంటి?
బిజీ లైఫ్.. గంటల తరబడి ఆఫీస్ వర్క్.. పెరుగుతున్న స్క్రీన్ టైమ్.. మారుతున్న జీవనశైలి! ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించడం చాలామందికి కష్టంగా మారింది. దీంతో వ్యాయామాన్ని ఒక పని లాగ కాకుండా.. లైఫ్‌స్టైల్ ఎక్స్‌పీరియన్స్‌గా మార్చుకుంటున్నారు హైదరాబాద్ వాసులు. కేవలం బాడీని ఫిట్‌గా ఉంచడం మాత్రమే కాదు.. మనసుకు ప్రశాంతత, మంచి ఆహారం, రికవరీ, మంచి నిద్ర, కొత్త పరిచయాలు.. ఇలా వెల్‌నెస్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఒకే కమ్యూనిటీలో కలుపుతున్నారు. యోగా, మెడిటేషన్ క్లాసుల నుంచి రన్నింగ్ క్లబ్‌ల వరకు.. పికిల్‌బాల్ వంటి కొత్త స్పోర్ట్స్ నుంచి వీకెండ్ వెల్‌నెస్ యాక్టివిటీస్ వరకు.. హైదరాబాద్‌లో కొత్త తరహా కమ్యూనిటీలు ఏర్పడుతున్నాయి.
హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని రంగారెడ్డి జిల్లాలోని చేగూరు గ్రామం సమీపంలో ఉన్న కన్హా శాంతివనంలోని1400 ఎకరాల సుందరమైన ప్రాంగణంలో హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ కేంద్రంలో ఒకేసారి లక్ష మంది ధ్యానం చేసుకునే సామర్థ్యం ఉంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, గచ్చిబౌలిలో ద వెల్‌నెస్ కో, మౌలాలీలో నేచురల్ వెల్‌నెస్ క్లబ్, తార్నాకలో లైఫ్ బ్లూమ్ వెల్‌నెస్ క్లబ్, జూబ్లీహిల్స్‌లో హాలిస్టిక్ వెల్‌నెస్ క్లినిక్, విజయనగర్ కాలనీలో బాడీ రీసెట్ వెల్‌నెస్ సెంటర్, మణికొండలో బోధి వెల్‌నెస్ సెంటర్, బేగంపేటలో మెగావీ వెల్‌నెస్ స్పా కేంద్రాలు వెలిశాయి.
యోగా క్లాసెస్
ఖైరతాబాద్‌లోని బోధి యోగా స్టూడియోలో నిత్యం యోగా శిక్షణ తరగతులతోపాటు ఆన్లైన్ క్లాసులు కూడా నిర్వహిస్తోంది. కొండాపూర్‌లోని ప్రాణ యోగా ఫిట్నెస్ సెంటర్, బంజారాహిల్స్‌లోని షర్మిల యోగా జోన్లలో అష్టాంగ యోగా, హఠ యోగా, పవర్ యోగా, ప్రెగ్నెన్సీ యోగా, యోగా థెరపీలతోపాటు ఆన్ లైన్ కార్పొరేట్ యోగా సెషన్లు, ప్రాణాయామం, మెడిటేషన్ సెషన్లను నిర్వహిస్తోంది. మణికొండ ఆదిత్య ఫోర్ట్ వ్యూ విల్లాస్లోని అష్టయోగాలో వెయిట్‌లాస్, కార్డియో, స్ట్రెస్ రిలీఫ్ యోగా శిక్షణ ఇస్తున్నారు. సద్గురు ఈషా హఠ యోగా యోగిక్యూలో హఠ యోగా టీచర్ ట్రైనింగ్ తరగతులు నిర్వహిస్తున్నారు. సిటీలోని సంయోగా స్టూడియో, కల్పతా యోగా జుంబా డ్యాన్స్, సుశీల్ యోగా, ఎనర్జైజర్ యోగా, అభిరాం యోగాశాల, ఆర్య యోగా అండ్ వెల్‌నెస్ ఇన్ స్టిట్యూట్, అభ్యాసయోగా, ఆర్యజననీ, ఆర్ట్ ఆఫ్ లివింగ్, నమస్తే ఇండియా పాఠశాల ఆఫ్ యోగా, వర్తమాన్ యోగా, నిశాంత్ యోగా సెంటర్లలో సిటీవాసులు యోగా చేస్తున్నారు. రామకృష్ణ మఠంలో పలు ఆధ్యాత్మిక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. నిత్య పూజలు, భజనలతోపాటు జపసాధన, గీతా దర్శన్ కార్యక్రమాలు చేపట్టారు. యోగాసనాలు, పాజిటివ్ థింకింగ్ కౌన్సెలింగ్, వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు.
మార్నింగ్ క్లబ్ ట్రెండ్
పొద్దున్నే లేచి వాకింగ్ చేయడం, వర్క్అవుట్, యోగా,హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ చేయడం.. ఆ తర్వాత ఫ్రెండ్స్‌తో ఫన్ అండ్ నెట్‌వర్కింగ్.. ఇలా సూర్యోదయంతోనే సిటీలో కొత్త ఎనర్జీ కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు ‘మార్నింగ్ క్లబ్’ ట్రెండ్. సిటీలో మార్నింగ్ హై క్లబ్ పేరుతో వెల్‌నెస్, ఫిట్నెస్ కార్యక్రమాలు సాగుతున్నాయి. కమ్యూనిటీలో ఉదయం 6 గంటల నుంచే మార్నింగ్ క్లబ్ సెషన్స్ ప్రారంభం అవుతున్నాయి. నైట్ పార్టీలకు గుడ్‌బై.. మార్నింగ్ క్లబ్స్‌కు హాలో! చెప్తుండటం నేటి యువతకు ట్రెండ్‌గా మారింది. తెల్లవారుజామున 5.30 నుంచి 8 గంటల మధ్య యువత, ఐటీ ఉద్యోగులు, ఫిట్నెస్ తపించేవారు కలిసి వాకింగ్, రన్నింగ్, యోగా, వర్క్అవుట్స్, మెడిటేషన్, హెల్దీ బ్రేక్‌ఫాస్ట్, నెట్‌వర్కింగ్ వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
సన్ షైన్ వీకెండ్స్
యోగా, మెడిటేషన్, సౌండ్ బాత్, మైండ్‌ఫుల్‌నెస్ ఇలా వెల్‌నెస్‌తో వీకెండ్‌ను రీచార్జ్ చేసుకుంటున్నారు. ఇదే హైదరాబాద్‌లో కొత్త ‘సన్ షైన్ వీకెండ్స్’ కల్చర్! ఉదయం యోగా, సౌండ్ బాత్, మెడిటేషన్, గ్రూప్ వెల్‌నెస్ యాక్టివిటీస్ వర్కింగ్ యువతకు వీకెండ్ కమ్యూనిటీగా మారింది. సన్ షైన్ వీకెండ్స్ కో ఫౌండర్ దీప్తి. పబ్బులకు బదులు పార్క్‌లకు, పార్టీలకు బదులు వెల్‌నెస్ కేంద్రాలకు వెళ్లి వాకింగ్, రన్నింగ్, యోగా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చంటారామె. గండిపేట తీరాన ఆయుర్ వన్ వాటర్ సైడ్ దగ్గర స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ కంబైన్డ్ యోగా చేయడం, కుండల తయారీ వర్క్‌షాప్‌లో పాల్గొనడం ఫిట్నెస్ క్లాసులకు హాజరు కావడంలో మజా వేరంటారు సన్ షైన్ వీకెండ్స్ ఫౌండర్ ఖమర్ అన్సారి.
వీకెండ్స్‌లో రన్నింగ్
సూర్యుడు ఉదయించకముందే నగరవాసులతో కలిసి 4 కి.మీ దూరం రన్నింగ్ చేయడం, ఆపై రిలాక్స్‌గా బ్రేక్ ఫాస్ట్ చేసి కాఫీ తాగడంలో ఉన్న మజా వేరంటారు సిటీ యూత్. హైదరాబాద్ హైడ్రన్ కమ్యూనిటీ సాధారణ వెల్‌నెస్ సెంటర్ కంటే రన్ క్లబ్, ఫిట్నెస్ కమ్యూనిటీగా నిలిచింది. ఫిట్నెస్, సోషల్ నెట్ వర్కింగ్, వీకెండ్ మార్నింగ్స్ రన్స్‌తో హైదరాబాద్ హైడ్రన్ కమ్యూనిటీ యూత్‌ను ఆకట్టుకుంటోంది. పార్టీలకు బ్రేక్ ఇస్తూ పొద్దున్నే పరుగులు తీయడం హైడ్రన్ ట్రెండ్‌గా మారింది.
