తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఉద్రిక్తతల నడుమ మొదలై 8 పని దినాలపాటు సాగిన ఈ సెషన్ శుక్రవారమే సాదాసీదాగా ముగిసింది. సభను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేశారు. మండలి కూడా వాయిదా పడింది. సభాపర్వంలో పాలక, విపక్షాలు విఫలమవుతూ శాసనసభ స్థాయిని తగ్గిస్తున్న సమయంలోనే... హైకోర్టు తన తాజా తీర్పుతో సభా నిర్వహణ నాణ్యతను ప్రశ్నార్థకం చేసింది. పార్టీ మారిన ఒక సభ్యుడిని పార్టీ మార్పిళ్ల (నిరోధక) చట్టం కింద అనర్హుడిగా ప్రకటించాలన్న సభ్యుల వినతిని తిరస్కరిస్తూ స్పీకర్ లోగడ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది.
బీఆర్‌ఎస్ శాసనసభ్యుడు (ఖైరతాబాద్)గా ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ (సికింద్రాబాద్) అభ్యర్థిగా పోటీచేసిన డి.నాగేందర్‌ను శాసనసభకు అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు శుక్రవారం నాడే తీర్పిచ్చింది. దేశంలోని పలు చట్టసభల్లో స్పీకర్లు ఏకపక్షంగా వ్యవహరిస్తూ, పార్టీ మార్పిళ్ల (నిరోధక) చట్టాన్ని హాస్యాస్పదం చేస్తున్న తరుణంలో ఇది సంచలన తీర్పు.
తెలంగాణ శాసనసభలో మరో 8 వరకు అటువంటి కేసులున్నాయి. వాటి గతి ఏమిటో వేచిచూడాలి. శాసన సభను మరింత ప్రజాస్వామ్య పద్ధతిలో నడుపుకుంటూ, ప్రజల విశాస్వం పెంపొందింపజేయడానికి ఇది అత్యుత్తమ సమయం. పాలక విపక్షాలదే బాధ్యత.
ప్రజా సమస్యల్ని ప్రతిబింబించడానికి, పరిష్కారాల సాధనకు ప్రతిపక్షం వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. సభ సజావుగా నడుస్తూ జన విశ్వాసం పొందడానికి శాసనసభ నిబంధనలకు తోడు సంప్రదాయాలను కూడా గౌరవిస్తూ, పాటిస్తూ పాలకపక్షం పట్టువిడుపులతో నడుచుకోవాలి. ఇవి రెండూ లోపిస్తున్న పరిస్థితికి తెలంగాణ అసెంబ్లీ తాజా సమావేశాలు అద్దం పట్టాయి.
సభలోవుంటూ, ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రభుత్వ పథకాలు, విధానాలను సంస్కరించడానికి గల అవకాశాలను సద్వినియోగపరుచుకోవడంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ విఫలమైంది. నిరసన తెలపడమే ఉద్దేశమైతే ఖాళీ నల్ల చొక్కాలతో సభకు వచ్చే ప్రయత్నం చేయాల్సింది. చొక్కాలపై నినాదాలు రాసుంటే సభలోకి అనుమతించకూడదన్న నిబంధన తమ హయాంలో తీసుకున్నదే అయినపుడు... అలా రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రెండో రోజయినా పరిస్థితిని సస్పెన్షన్ దాకా రానీయకుండా చూసుకోవాల్సింది.
సెషన్ మొత్తం వారు సభలో లేక రాజధాని, శివార్లలోని కోటిన్నర మంది జీవితాల్ని ప్రభావితం చేసే ‘క్యూర్’ వంటి బిల్లులు సమగ్ర చర్చ, తగిన ప్రతిఘటన లేకుండానే ఆమోదం పొందే పరిస్థితి వచ్చింది. బిల్లును తిరస్కరించండి అంటూ దొంతి నర్సింహారెడ్డి వంటి పాలసీ నిపుణులు రాష్ట్ర గవర్నర్‌ని కోరాల్సి వచ్చింది. ‘సస్పెన్షన్ ఎత్తివేయండి, మేం సభకు వస్తాం’ అని విపక్షం కోరినప్పుడు
పాలకపక్షం, ప్రభుత్వం సమ్మతించి ఉండాల్సింది.
ఇటువంటి సంప్రదాయం సభలో లోగడ పలుమార్లు పాటించిందే! రాష్ట్రం ఎదుర్కొంటున్న తీవ్ర కరువు, వర్షాభావ పరిస్థితి, ఎల్‌నినో ప్రభావ ప్రతికూలత, 22(ఏ) నిషేధిత భూవివాదాలు వంటి కీలకాంశాలు సభలో చర్చిస్తున్నప్పుడు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లేకపోవడం రాష్ట్ర ప్రజలకు జరిగిన నష్టంగానే పరిగణించాల్సి ఉంటుంది. ఇది విపక్షం స్వయం
కృతం అన్నది ప్రభుత్వ వాదన.
పరస్పర ఆరోపణలే...!
సభ లోపల పాలకపక్షం, సభ బయట విపక్షం మీడియా ద్వారా తమ వాణిని ప్రజలకు వినిపించేందుకు ప్రాధాన్యత ఇచ్చాయి. అంతేతప్ప సభ ఔన్నత్యాన్ని, హుందాతనాన్ని నిలిపేందుకు యత్నించలేదు. 22 (ఏ) నిషేధిత భూముల వివాదం వంటి కీలక అంశంలో పరిష్కారాల ప్రయత్నం కన్నా పరస్పర ఆరోపణలకే పాలక-, విపక్షాలు పరిమితమయ్యాయి. అదేదో ముతక సామెత చెప్పినట్టు ‘మీరు వెయ్యి ఎకరాల దోపిడీ చేశారు’ అంటే, ‘అగో మీరు రెండు వేల ఎకరాలు దోచుకోలేదా?’ అని పరస్పరం తిట్టుకున్నారు. కానీ, ఎవరూ దోచుకోలేదన్నది ప్రజల ముందు నిరూపితం కాలేదు.
ప్రతిపక్షం ఒక రాజ్యాంగ బాధ్యత
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షమన్నది ఒక వ్యవస్థ, రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యత. సభ లోపల, బయట ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించాలి. ప్రభుత్వ పనులు, విధానాలు, నిర్వాకాల మంచీ
చెడుల్ని సమీక్షించి చెడును తప్పుబట్టినట్టే మంచిని ప్రశంసిస్తూ అవసరమైన నిర్మాణాత్మక సూచనలు చేయడం ప్రతిపక్షం బాధ్యత.
ప్రతిపక్షం ఏ రకమైన పాత్ర పోషిస్తుంది? అన్నది ప్రజలే గమనిస్తారు. తగిన సమయంలో, తగు నిర్ణయం వారే తీసుకుంటారు. ‘ప్రతిపక్షం’ అనే హోదా పాలకపక్షం వారి ‘దయ’ కాదు. ‘ప్రభుత్వం’ అనే అధికారం విపక్షం ఇచ్చే ‘భిక్ష’ కాదు. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ ఒకసారి పార్లమెంటులో మాట్లాడుతూ ‘కాంగ్రెస్ దయవల్ల నేను ప్రధానిని కాలేదు, కాంగ్రెస్ వ్యతిరేకించినప్పటికీ ప్రధాని అయ్యాను, ప్రజాతీర్పు వల్ల’ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన పరిస్థితులున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ‘ప్రతిపక్ష నేత హోదా లేకుండా నేను అసెంబ్లీకి వచ్చేది లేదు’ అని విపక్ష నేత వైఎస్ జగన్ (వైఎస్సార్సీపీ) సభకు రావటం లేదు. మాజీ సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీకి 2024 ఎన్నికల్లో ప్రజలు 175 శాసనసభ స్థానాలకుగాను 11 స్థానాలే ఇచ్చారు. దాంతో ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కలేదు. న్యాయస్థానం తలుపు తట్టినా చుక్కెదురయింది.
ఉద్యమ నేతగా ఉండి, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ (బీఆర్ఎస్)కు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం నిలవకపోయినా 39/119 స్థానాలతో ప్రతిపక్ష నాయకుడి హోదా దక్కింది. ఆయన కూడా నిర్దిష్ట కారణాలేవీ చెప్పకుండానే అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదు. మొదట్లో కొన్ని సమావేశాలకు హాజరైనా తర్వాతి కాలంలో గైర్హాజరవుతున్నారు.
ఇరువురిదీ తప్పే
ప్రతిపక్ష నేతగా ఉండి కేసీఆర్ శాసనసభకు రాకపోవడాన్ని పాలకపక్షమైన కాంగ్రెస్ వివిధ వేదికల నుంచి విమర్శిస్తోంది. సభకురాని ప్రతిపక్ష నేత అంటూ, ఆయన హోదా నిర్వహణకు ఎంత ప్రజాధనం వ్యయమవుతోందో లెక్కలు చెప్పింది.
బీఆర్ఎస్ ఇతర ముఖ్య నాయకులైన హరీష్ రావు, కేటీఆర్ తదితరులు వేర్వేరు సందర్భాల్లో ఏవో కారణాలు చెప్పినప్పటికీ, కేసీఆర్ ఎందుకు శాసనసభకు రావట్లేదనే విషయంలో నిర్దిష్ట కారణాలు ఇప్పటివరకు స్పష్టం కాలేదు. సభ్యత్వం రద్దు తప్పించుకునే సాంకేతికత కోసం అప్పుడప్పుడు తప్ప వరుస సమావేశాలకు ప్రతిపక్షనేత గైర్హాజరవడం పార్లమెంటరీ పంథాకు నప్పదు. అది తప్పే! పాలకపక్షం కూడా అదే విషయాన్ని పట్టుకొని రాద్ధాంతం చేయడం కూడా శోభనివ్వదు.
కేసీఆర్ సభకు రావాలని డిమాండ్ చేస్తూ ఈ సారి సమావేశాల ముందు పాలకపక్షమైన కాంగ్రెస్ రాజధాని నగరంలో ఒకరోజు మహాధర్నా నిర్వహించింది. పీసీసీ అధ్యక్షుడితోపాటు పలువురు మంత్రులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.
ప్రతిపక్ష నాయకుడు సభకు రావాలనే పాలకపక్షం పట్టు, విపరీత కోరిక ఏంటి? అనే ప్రశ్న సహజమే!. అది కూడా ఒకరకంగా ప్రతిపక్షాన్ని, దాని పనితీరును ఎండగట్టడమే అవుతుంది. తమ పనితీరు- ప్రతిపక్షం పనితీరును బట్టి వచ్చే ఎన్నికల్లో ప్రజాతీర్పును కోరే క్రమంలో అధికార పక్షానికి ఎంతోకొంత ఈ అంశమూ కలిసివచ్చేదే! అంతే తప్ప, విపక్షనేత సభకు వచ్చి తీరాలని ముఖ్యమంత్రితో సహా అధికారపక్షం పట్టుబట్టడాన్ని ప్రజలు వింతగా చూస్తున్నారు.
ముద్ర పడట్లేదు
ప్రభుత్వ పనితీరును సమీక్షించేందుకు, పాలకపక్షంపై ఆధిపత్య సాధనకు ప్రతిపక్షాలకు శాసనసభ, మండలి సమావేశాలు ఒక అవకాశం. అందుకోసం అవి నిరీక్షిస్తూ ఉంటాయి. దాన్ని తిప్పికొట్టే ఎత్తులతో పాలకపక్షం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. అందుకే, వ్యూహాలతో సమావేశాలకు సమాయత్తం కావటం పార్టీలకు అలవాటు.
తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీలు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి తామే ప్రత్యామ్నాయమని, కాంగ్రెస్ ఓటమి ఖాయం కనుక వచ్చే ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసేది తాము అంటే తాము అని ప్రకటించుకుంటున్నాయి. కానీ, చట్టసభల సమావేశాల్ని ఆ స్థాయిలో సానుకూలంగా మలచుకున్న దాఖలాలే అరుదు. సస్పెన్షన్లయినా, వాకౌట్లయినా కొంతమేరకే విపక్షానికి సానుకూలతనిస్తాయి. విబేధించే విపక్షాన్ని ఏదో రూపంలో సభ బయటకుపంపి కొన్నిసార్లు వ్యూహాత్మకంగా బిల్లులు ఆమోదింపజేసుకోవడం వంటి ప్రభుత్వ వ్యవహారాలను పాలకపక్షాలు సజావుగా జరిపించుకుంటాయి. సభలో ఉండి, గిట్టని అంశాలను విభేదించి, ప్రజావాణి ప్రతిబింబించడానికే ప్రతిపక్షాలు ప్రయత్నించాలి.
సభలోగాని, బీఆర్ఎస్ సభ్యులు సభలో లేని సందర్భాల్లోగాని తమదైన ముద్రవేసే ప్రభావం బీజేపీ నుంచి కనిపించడం లేదు. ప్రస్తుత సభలో బీజేపీకి గుర్తించదగిన సంఖ్యాబలం ఉన్నప్పటికీ, బీజేపీ శాసనసభాపక్షం ఉమ్మడిగా గట్టి స్వరం వినిపిస్తున్న సందర్భాలు తక్కువే! పాలక, విపక్షాలు మరింత శ్రద్ధ, నిబద్ధతలతో సభ హుందాతనాన్ని పెంచాల్సిన అత్యున్నత సమయమిది.
- దిలీప్ రెడ్డి,పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్
గమనిక: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected] రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
