- అంచనాలకు మించి సాగు.. మొక్కఎదుగుదలపై ప్రభావం
- దిగుబడిపై రైతుల ఆందోళన
- పత్తి కొనుగోళ్లకు సీసీఐ సన్నద్ధం.. టెండర్లు పూర్తి
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: పత్తి పంట ఈ ఏడాది అంచనాలకు మించి సాగైంది. ఎల్‌నినో ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంట ఎదిగే దశలోనే తెగుళ్లు రైతులను పీడిస్తున్నాయి. దీంతో తెల్లబంగారం రైతుల చేతికి రాకముందే రంగు మారుతోంది. పూత, కాత దశలో ఎర్రనల్లి అటాక్ చేయడంతో మొక్కల ఎదుగుదల నిలిచిపోయింది.
వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది పత్తి సాగు నెల ఆలస్యంగా ప్రారంభం కావడం కూడా దిగుబడులపై ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పత్తి సీజన్ ప్రారంభానికి ముందే మార్కెట్‌లో నిల్వ పత్తికి క్వింటాకు రూ.9 వేలకుపైగా ధర లభించడంతో రైతుల్లో ఆశలు పెరిగాయి.
సీసీఐ ప్రకటించిన మద్దతు ధర రూ.8,667 కంటే అధికంగా వ్యాపారులు కొనుగోలు చేస్తుండటంతో పంటను తెగుళ్ల నుంచి కాపాడుకునేందుకు రైతులు ఖర్చుకు వెనకాడకుండా పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. అయినా ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షాలు లేకపోవడంతో ఆశించిన స్థాయిలో దిగుబడులు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.
అంచనాలకు మించి సాగు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఏడాది పత్తి సాగు వ్యవసాయ శాఖ అంచనాలను మించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5,54,387 ఎకరాల్లో పత్తి సాగవుతుందని ఆఫీసర్లు అంచనా వేయగా, 101 శాతం మేరకు 5,61,578 ఎకరాల్లో సాగు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 98,764 ఎకరాలు కాగా, ఈ ఏడాది 1,09,442 ఎకరాల్లో పత్తి సాగు చేపట్టారు. జనగామ జిల్లాలోనూ సాధారణ సాగు విస్తీర్ణానికి మించి రైతులు పత్తి సాగు చేపట్టారు.
ఎదుగుదలపై ప్రభావం..
వర్షాభావ పరిస్థితులతో పత్తితో పాటు ఆరుతడి పంటల ఎదుగుదల కూడా నిలిచిపోయింది. నల్లరేగడి నేలలు మినహా ఎర్ర నేలల్లో తేమశాతం తగ్గిపోవడంతో పత్తి పంటలు ఎండుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం పత్తి పూత, కాత దశలో ఉండగా ఎండ తీవ్రతకు ఎర్రనల్లి ఉధృతి పెరిగి ఆకుల రసాన్ని పీల్చేస్తోంది. ఎన్ని రకాల రసాయన మందులు పిచికారీ చేసినా ఆశించిన ఫలితం కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు.
పత్తి సాగు సుమారు నెల ఆలస్యంగా ప్రారంభం కావడంతో అక్టోబర్ మొదటి వారంలో పత్తి తీత ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కొన్ని క్షేత్రాల్లో ఇప్పటికే ఏర్పడిన కాయలు ఎండ తీవ్రతకు పగులుతున్నాయని, ఎర్రనల్లి ప్రభావంతో పత్తి రంగు మారుతోందని, దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పత్తి కొనుగోళ్లకు సన్నద్ధం..
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఈ ఏడాది పత్తి కొనుగోళ్లకు సీసీఐ సన్నద్ధమవుతోంది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో పాటు జిన్నింగ్ మిల్లుల్లో పత్తి బేళ్ల కోసం టెండర్లు పూర్తి చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16 మార్కెట్ యార్డుల పరిధిలో 19 సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
భూపాలపల్లి, కాటారం, చిట్యాల, ములుగు, కేసముద్రం, వరంగల్, జనగామ, మహబూబాబాద్, తొర్రూర్, నర్సంపేట, స్టేషన్ ఘన్‌పూర్, ఆత్మకూర్, పరకాల, ఎల్కతుర్తి తదితర ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేపట్టేందుకు మార్కెటింగ్ శాఖ సిద్ధమవుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది సుమారు 50 లక్షల క్వింటాళ్ల పత్తి మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పత్తి విక్రయాల్లో గతేడాది అమలు చేసిన ‘కపాస్ కిసాన్’ యాప్ ద్వారానే ఈ ఏడాది కూడా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులు యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని పత్తిని విక్రయించుకోవచ్చు. అయితే ఎల్‌నినో ఎఫెక్ట్‌తో ఆశించిన మేర పత్తి దిగుబడి వచ్చే పరిస్థితులు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
