- సందడిగా ప్రారంభమైన 24వ స్నాతకోత్సవం
- నేడు పీజీ, పీహెచ్ డీ స్కాలర్లకు పట్టాలు
హనుమకొండ, వెలుగు: వరంగల్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 24వ స్నాతకోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. నిట్ లోని అంబేద్కర్ లర్నింగ్ సెంటర్ లో రెండు రోజులపాటు జరిగే కాన్వొకేషన్ ను శనివారం బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్ పర్సన్ బీవీఆర్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. నిట్ డైరెక్టర్ ప్రొ.బిద్యాధర్ సుబుధి నివేదికను సమర్పించారు. అనంతరం చీఫ్ గెస్ట్ గా హాజరైన టెక్సాస్ ఇన్ స్ట్రుమెంట్స్ ఇండియా ఎండీ సంతోష్ కుమార్ పట్టాలు ప్రదానం చేశారు.
930 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, 22 మంది ఎగ్జిట్ డిగ్రీ విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. ఆదివారం పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయనున్నారు. యూజీ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి గోల్డ్ మెడల్స్ అందజేసి అభినందించారు. ఏవియేషన్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ రంగాల్లో ఆటోమేటిక్ కంట్రోల్ టెక్నాలజీల వినూత్న వినియోగానికి చేసిన సేవలకు పీకే మెనన్ కు డాక్టర్ ఆఫ్ సైన్స్ గౌరవ డిగ్రీ ఇచ్చారు.
దేశ సెమీ కండక్టర్ రంగ అభివృద్ధికి కృషి చేసిన మైక్రాన్ ఇండియా ఎండీ ఆనంద్ రామమూర్తికి గౌరవ పీహెచ్ డీ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చీఫ్ గెస్ట్ టెక్సాస్ ఇన్ స్ట్రుమెంట్స్ ఇండియా ఎండీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ టెక్నికల్ స్కిల్స్, డిగ్రీలు, రెజ్యూమ్ ఒక వ్యక్తి కెరీర్‌కు అవసరమైన సాఫ్ట్‌వేర్ అయితే.. వ్యక్తిత్వం, నిజాయతీ, విశ్వసనీయత, ఇతరుల పట్ల వ్యవహరించే తీరు, విలువలు హార్డ్‌వేర్ లా పని చేస్తాయని తెలిపారు.
నిట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్‌పర్సన్ బీవీఆర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏఐ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో ఇంజనీర్ల బాధ్యతలు మరింత పెరుగుతాయని తెలిపారు. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుది మాట్లాడుతూ బీటెక్ స్టూడెంట్లకు ఏఐ, మెషీన్ లర్నింగ్‌ను తప్పనిసరి చేసినట్లు పేర్కొన్నారు.
