- ఎక్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునకు విశేష స్పందన
- రాణి రుద్రమ, కాకతీయ పేర్లను సూచించిన డైరెక్టర్ సందీప్ వంగా
- సమ్మక్క-సారక్క పేరు సూచించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల
- ప్రజాపాలనలో విమానాశ్రయం కల నెరవేరుతోందన్న సీఎం
- మామునూర్ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రయాణానికి ఎదురుచూస్తున్నామని ట్వీట్
హైదరాబాద్, వెలుగు: వరంగల్‌లో రూపుదిద్దుకుంటున్న ప్రపంచస్థాయి విమానాశ్రయానికి పేరుపెట్టాలంటూ శనివారం ‘ఎక్స్’లో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపునకు సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా స్పందన వెల్లువెత్తింది. చాలా మంది రాణి రుద్రమ, కాకతీయ, సమ్మక్క సారక్క, పీవీ నర్సింహారావు, కాళోజీ తదితర పేర్లు సూచించారు. కాగా, ప్రముఖ దర్శకుడు సందీప్ వంగా.. ‘రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్(ఆర్ఐఏ) లేదంటే కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (కేఐఏ) పేర్లను సజెస్ట్ చేశారు. వరంగల్ వారసత్వాన్ని, సాంస్కృతిక స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ పేర్లు పెడితే బాగుంటుందని ఆయన ట్వీట్ చేశారు. విమానాశ్రయాన్ని సాకారం చేస్తున్న సీఎంకు సందీప్‌వంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా, సమ్మక్క సారక్క ఎయిర్‌పోర్ట్‌గా పేరు పెట్టాలని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సూచించారు.
ప్రజా పాలనలో కల సాకారం: సీఎం రేవంత్
ప్రజా ప్రభుత్వం కృషితో వరంగల్ విమానాశ్రయం కల సాకారం కాబోతున్నదని ‘ఎక్స్’ వేదికగా సీఎం రేవంత్ పేర్కొన్నారు. పదేండ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. వరంగల్‌లో విమానాశ్రయం కలను నిజం చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. ఆ పార్టీ నాయకులు కేవలం తమ కుటుంబ ప్రయోజనాలు, విలాసవంతమైన ఫామ్‌హౌస్‌ల మీదనే దృష్టి పెట్టారని విమర్శించారు. వరంగల్‌లోని మమునూర్ విమానాశ్రయం భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 295 కోట్లు కేటాయించడంతోపాటు అవసరమైన భూమిని పూర్తిగా సేకరించి, ‘ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (ఏఏఐ)కి అప్పగించిందని గుర్తుచేశారు. దీంతో క్షేత్రస్థాయిలో విమానాశ్రయం రూపుదిద్దుకుంటోందని, ఇది కేవలం ఒక విమానాశ్రయం మాత్రమే కాదని, పరిశ్రమలు, పర్యాటకం, విద్య, ఉద్యోగాలు, పెట్టుబడులకు ఒక కొత్త ద్వారం కాబోతోందని చెప్పారు. ‘‘ మెరుగైన అనుసంధానం కలిగిన తెలంగాణకు కొత్త చిహ్నంగా నిలవనున్న వరంగల్ మామునూర్ విమానాశ్రయం నుంచి ప్రయాణించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా” అని తన ఆకాంక్షను వెల్లడించారు. ఇక చివర్లో ‘మరి మన వరంగల్ కొత్త విమానాశ్రయానికి ఏ పేరు పెడ్దాం..? మీ సూచనలను తెలియజేయండి అంటూ ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు.
