- ప్రతివాదిగా బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
- అంతకుముందే బీజేఎల్పీ నేత ఏలేటి కేవియట్
- ఈ నెల 21న సీజేఐ ముందు మెన్షన్ చేసే అవకాశం
- విచారణపై చీఫ్ జస్టిస్‌దే తుది నిర్ణయం
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు అనుమతిస్తుందా లేదా అనేది వేచిచూడాల్సి ఉంది. ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ శుక్రవారం హైకోర్టు సీజే బెంచ్ తీర్పును వెలువరించింది. శనివారం సుప్రీంకోర్టులో దానం తరఫున అడ్వకేట్ రావి యోగేశ్ వెంకట స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ఋ ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని ప్రతివాదిగా చేర్చారు. ఈ పిటిషన్‌కు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ డైరీ నెంబర్ అలాట్ చేసింది.
ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో సోమవారం దానం తరఫు న్యాయవాదులు సీజేఐ ధర్మాసనం ముందు మెన్షన్ చేసే ఆస్కారం ఉంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్, పార్టీ ఫిరాయించారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు బీఆర్ఎస్ కంప్లైంట్ చేసింది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ జరిపిన స్పీకర్.. దానం చట్టపరంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదని మార్చి 11న తీర్పు వెలువరించారు. దీన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. విచారణ జరిపిన హైకోర్టు సీజే బెంచ్ తాజాగా కీలక ఉత్తర్వులు ఇచ్చింది. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయడంతో పాటు, ఈ విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని పక్కన పెట్టింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో నిలిచిన నాటి నుంచి ఈ అనర్హత అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది.
ఖైరతాబాద్ శాసన సభస్థానం ఖాళీ అయినట్లు స్పీకర్, ఈసీకి సమాచారం ఇచ్చింది. ఈ అంశంలో సుప్రీంకోర్టుకు వెళ్లబోనని, ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటానని దానం నాగేందర్ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే సుప్రీంకోర్టులో సవాల్ చేయడం గమనార్హం.
దానం కేసులో ఏలేటి కేవియట్
మరోవైపు దానం కేసులో ఏలేటి మహేశ్వర్ రెడ్డి కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. శనివారం ఏలేటి తరఫున అడ్వకేట్ మనిష్ తివారి దీనిని వేశారు. దానం పిటిషన్ పై ఉత్తర్వులు ఇచ్చే ముందు తమ వాదనలు పరిగణలోకి తీసుకోవాలని కేవియట్ పిటిషన్ లో కోరారు.
