ఆమనగల్లు, వెలుగు: తెలంగాణలో పట్టు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం బాగుందని తమిళనాడు రూరల్ ఇండస్ట్రీస్ మినిస్టర్ మాతన్ రాజా తెలిపారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా తమిళనాడు రాష్ట్ర సెరికల్చర్ రైతులు, అధికారులు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి శనివారం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కోరింతకుంట తండాలోని సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ ను సందర్శించారు.
పట్టు రైతులతో సమావేశమై మల్బరీ సాగు, నీటి యాజమాన్యం, ఉత్పాదకత పెంపుపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమిళనాడులో సెరికల్చర్ లో వస్తున్న నూతన పద్ధతులు, వాణిజ్య పంటగా ఎలా అభివృద్ధి చేయాలనే అంశాలపై అధ్యయనంలో భాగంగా రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తున్నట్లు చెప్పారు.
మల్బరీ సాగులో నూతన సాంకేతిక పరిజ్ఞానం, పద్ధతులు, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించేందుకు రైతులు చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ సరోజ, సెరికల్చర్ జేడీ లత, ఏడీ మహిపాల్, సైంటిస్టులు తిరూపం రెడ్డి, భువన రాఘవేందర్, రిసోర్స్ సెంటర్ హెడ్ శక్రునాయక్ పాల్గొన్నారు.
