రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో శనివారం జరిగిన ప్రమాదాల్లో ఏడుగురు చనిపోయారు. రంగారెడ్డి జిల్లా పాలమాకుల సమీపంలో జరిగిన ప్రమాదంలో నలుగురు చనిపోగా, ఒకరికి గాయాలయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్ సమీపంలో ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు.
గండిపేట/నవాబుపేట, వెలుగు: స్వగ్రామంలో వినాయక నిమజ్జనంలో పాల్గొని తిరిగి వస్తుండగా, రంగారెడ్డి జిల్లా పాలమాకుల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు చనిపోయారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం మెట్టుగడ్డ తండాకు చెందిన మాజీ సర్పంచ్ జమునాబాయి(50), ఆమె భర్త సేవాలాల్ సమితి మండల మాజీ అధ్యక్షుడు, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు లింబ్యా నాయక్(55)తో పాటు వారి బంధువులు మాన్ సింగ్(50), వసురాం(49) శంషాబాద్‌లో ఉంటున్నారు.
శుక్రవారం గ్రామంలో జరిగిన వినాయక నిమజ్జనోత్సవంలో పాల్గొని కారులో శంషాబాద్‌కు బయలుదేరారు. పాలమాకుల వద్ద కారు అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదంలో కారు డ్రైవర్ అశోక్ తీవ్రంగా గాయపడగా, అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
జమునాబాయి గతంలో మెట్టుగడ్డ తండా సర్పంచ్‌గా పని చేశారు. లింబ్యా నాయక్ శంషాబాద్ పరిసరాల్లో ఇటుక బట్టీల వ్యాపారం చేస్తున్నాడు. తండా వాసుల ఆహ్వానం మేరకు వినాయక నిమజ్జనానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరగడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి దుష్యంత్‌రెడ్డి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వెనక నుంచి వెహికల్ఢీకొనడంతో..
శామీర్ పేట: పంక్చర్ అయిన టైర్ మార్చుతుండగా వెనక నుంచి వెహికల్ ఢీకొనడంతో ముగ్గురు కార్మికులు చనిపోయారు. శామీర్‌పేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అశోక్ లేలాండ్ మినీ వ్యాన్‌లో ఇస్మాయిల్ హుస్సేన్(26), ఇబ్రహీం(19), రింకు(34), భీమ్ షా చేగుంట నుంచి స్క్రాప్ లోడుతో కీసర వైపు బయలుదేరారు.
ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్–6 నుంచి బయటకు వచ్చి మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ వైపు ప్రయాణిస్తుండగా లియోనియా ఫుట్ ఓవర్ బ్రిడ్జి దాటాక వెనక టైర్ పంక్చర్ అయింది. వ్యాన్‌ను ఎమర్జెన్సీ లైన్ లో నిలిపి రింకు, ఇబ్రహీం టైర్ ను తొలగించేందుకు ప్రయత్నిస్తుండగా, ఇస్మాయిల్ హుస్సేన్ టార్చ్ లైట్ పట్టుకోగా, భీమ్ షా టైర్ల కింద పెట్టేందుకు రాళ్లు తీసుకురావడానికి వెళ్లాడు. అదే సమయంలో వెనక నుంచి వేగంగా వచ్చిన టాటా ట్రక్ నిలిపి ఉన్న అశోక్ లేలాండ్ వెహికల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముషీరాబాద్ కు చెందిన రింకు, ఇస్మాయిల్ హుస్సేన్ అక్కడికక్కడే చనిపోగా, తీవ్రంగా గాయపడిన ఇబ్రహీంను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు శామీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
