సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో కేసీఆర్ ఫాం హౌస్ భూముల ఎపిసోడ్లో కీలక పరిణామం జరిగింది. ఎర్రవల్లిలో సర్వే నెంబర్ 325కు సంబంధించి రైతులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. మర్కుక్ మండలం ఎర్రవల్లి వద్ద మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ సమీపంలోని భూములను రెవెన్యూ అధికారులు రెండ్రోజులుగా పరిశీలించాక రైతులకు శనివారం నోటీసులు ఇవ్వడం గమనార్హం. ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్ గ్రామాల పరిధిలోని భూముల సర్వే కోసం ఐదు టీమ్స్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఏడీ సుదర్శన్ నేతృత్వంలో నలుగురు డిప్యూటీ ఇన్ స్పెక్టర్లతో పాటు మర్కుక్ మండల రెవెన్యూ సిబ్బందిని ఐదు టీమ్లుగా విభజించి రెండు గ్రామాల పరిధిలో భూముల సర్వే చేపట్టారు. ఎర్రవల్లి గ్రామ పరిధిలోని 325 సర్వే నంబర్ లోని 388.5 ఎకరాల భూమికి సంబంధించిన బౌండరీలను నిర్థారించే ప్రక్రియను ప్రారంభించారు. ఈ సర్వే నంబర్ పరిధిలోని కెనాల్తో పాటు చెరువుల హద్దులను నిర్థారించనున్నారు.
మొదటి రోజు ఎర్రవల్లి గ్రామ పరిధిలోని 325 సర్వే నంబర్లో భూములను పరిశీలించగా, అక్కడి రైతులు కొందరు అధికారులను అడ్డుకున్నారు. దీంతో రెండో రోజు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ALSO READ : గచ్చిబౌలిలో ఒరిగిన నాలుగంతస్తుల బిల్డింగ్ను కూల్చేశారు !
సర్వే జరుగుతున్న ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు పెట్రోలింగ్ నిర్వహించారు. ఇదే సమయంలో మర్కుక్ తహసీల్దార్ కార్యాలయంలో శాటిలైట్ మ్యాప్లు, భూ రికార్డులను పరిశీలించారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ పరిధిలో ప్రభుత్వ భూములు, అసైన్డ్ ల్యాండ్స్ ఏమైనా ఉన్నాయా..? అని పరిశీలించారు.
